మూడు రాజధానుల పేర ప్రజలను మోసం చేస్తున్నారు: టీడీపీ నేత నిమ్మల రామానాయుడు

24-12-2019 Tue 21:16
  • అమరావతిని చంపాలని చూడటం సబబు కాదు
  • విశాఖను టీడీపీ ప్రభుత్వం ఇప్పటికే అభివృద్ధి చేసింది
  • ఇక్కడ జగన్ కొత్తగా చేసేదేం లేదు

అమరావతి ముంపు ప్రాంతం అనేది పచ్చి అబద్ధం అని టీడీపీ నేత నిమ్మల రామానాయుడు అన్నారు. అమరావతి రాజధానిగా తగదని అనడం భావ్యం కాదన్నారు. ఓ కుక్కను చంపాలంటే దానిని ముందుగా పిచ్చికుక్క అని ముద్ర వేసి చంపినట్లు.. అమరావతిని చంపాలని చూడటం సబబు కాదన్నారు.

ఈ రోజు రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ పెద్దలు ఆరోపిస్తున్నట్లుగా అమరావతి ఏ ఒక్క సామాజికవర్గానికి చెందినదో కాదని, రాష్ట్ర ప్రజలందరి భవిష్యత్ అని పేర్కొన్నారు . అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ చేస్తున్న ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో జ్యూడిషియల్ ఎంక్వైరీ చేయించాలని డిమాండ్ చేశారు.

మూడు రాజధానుల పేర ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. విశాఖను ఇప్పటికే తమ ప్రభుత్వం పారిశ్రామికంగా అభివృద్ధి చేసిందన్నారు. లోలో గ్రూప్స్‌ను తీసుకువచ్చి విశాఖను ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దారన్నారు.  విశాఖలో ఇప్పుడు జగన్ కొత్తగా చేసేదేం లేదన్నారు. కేవలం ప్రజలను మోసం చేయడానికే ఈ ప్రతిపాదనలు అని విమర్శించారు.  రాష్ట్ర ప్రజలు ఒక నియంతతో పోరాడుతున్నారు తప్ప.. ఒక ముఖ్యమంత్రితో కాదన్నారు. ప్రజలు అన్నింటినీ ఎదిరించి నిలబడాలని పిలుపునిచ్చారు.