Karnataka: విద్యార్థులు, మేధావులకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలి: కాంగ్రెస్ నేత డీకే శివకుమార్

  • విద్యార్థులు, మేధావులను అర్బన్ నక్సల్స్ తో పోల్చడం దారుణం 
  • ఈ ప్రజల మద్దతుతోనే బీజేపీ అధికారంలోకి వచ్చింది
  • ప్రజల జీవితాలతో బీజేపీ చెలగాటమాడుతోంది

సీఏఏను నిరసిస్తూ.. రాజ్యాంగాన్ని పరిరక్షించాలంటూ నిరసన తెలిపిన విద్యార్థులు, మేధావులను ప్రధాని అర్బన్ నక్సల్స్ తో పోల్చడం దారుణమని కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే శివకుమార్ అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ వైఖరిని విమర్శించారు. గత ఆదివారం ఢిల్లీ రామ్ లీలా మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ అర్బన్ నక్సల్స్ అన్న వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

‘రాజ్యాంగాన్ని, పరిరక్షించాలంటూ నిరసన తెలిపిన విద్యార్థులు, మేధావులను ప్రధాని అర్బన్ నక్సల్స్ తో పోల్చారు. ఇందుకు ఆయన దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి’ అని శివకుమార్ అన్నారు. మోదీ చెబుతున్న ఈ ప్రజల మద్దతుతోనే బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు. ఆ ప్రజలే ఇప్పుడు నిరసనలు తెలపడానికి రోడ్డెక్కారని వివరించారు. ఈ మాట అనిపించుకునేందుకేనా వారు మీకు అధికారం కట్టబెట్టారు? అంటూ ఆయన బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీశారు.

దేశం ఆర్థిక మందగమనంతో కొనసాగుతున్న వేళ ఇలాంటి చట్టం తెచ్చి.. ప్రజల జీవితాలతో చెలగాటమాడుతోందని శివకుమార్ మండిపడ్డారు. దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉద్యోగాల కల్పనకు ఎవరూ సిద్ధపడటం లేదని ధ్వజమెత్తారు. సీఏఏపై నిరసనలను అడ్డుకునేందుకు మంగళూరులో 144 సెక్షన్ అమలుకు ఉత్తర్వులిచ్చిన కర్ణాటక ప్రభుత్వాన్ని కూడా ఆయన తప్పుబట్టారు.

More Telugu News