NPR: ఎన్పీఆర్ కు కేంద్రం ఆమోదం: కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్

  • ఎన్పీఆర్ తో ఎన్నార్సీకి సంబంధం లేదు
  • ఎన్పీఆర్ 2010లో ప్రారంభమైంది... 2020లో పూర్తవుతుంది
  • సెన్సస్ (జనాభా లెక్కలకు)కు, ఎన్పీఆర్ కు తేడా ఉంది
  • 2021లో జన గణన ఇంటింటికి వచ్చి చేస్తారు

జాతీయ జనాభా నమోదు (ఎన్పీఆర్) అప్ డేషన్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.8,500 కోట్లు కేటాయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2020 ఏప్రిల్ నుంచి ఎన్పీఆర్ అప్ డేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. 2010లో ఎన్పీఆర్ కోసం డేటా సేకరించారు. 2015లో ఇంటింటి సర్వే నిర్వహించి తొలి అప్ డేషన్ చేసి డిజిటలైజేషన్ కూడా పూర్తి చేశారు. తాజాగా ఈ ఎన్పీఆర్ ను 2021 సెన్సస్ తో అప్ డేట్ చేయాలని కేంద్రం నిర్ణయించింది.

ఈ మేరకు వివరాలను కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియాకు వెల్లడించారు. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఈ అప్ డేషన్  ప్రక్రియను పూర్తిచేయాలని నిర్ణయించిందన్నారు. ఈ అప్ డేషన్ ను పేపర్ లెస్ గా నిర్వహించాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. యాప్ ద్వారా జనాభా వివరాల నమోదు ప్రక్రియ సాగించనున్నట్లు తెలిపారు. దీని వల్ల లక్ష్యిత ప్రజలకు ఉద్దేశించిన పథకాలు ఎంతమందికి అందుతున్నాయన్న వివరాలు తెలుస్తాయన్నారు. ప్రజలు ఎటువంటి పత్రాలూ చూపించాల్సిన అవసరం లేదని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. బయో మెట్రిక్, సెల్ఫ్ డిక్లరేషన్ ప్రక్రియతో జనాభా లెక్కల ప్రక్రియ సాగుతుందని చెప్పారు.

ఎన్పీఆర్ పై అపోహలు వద్దు

ఎన్పీఆర్ పై అపోహలు వద్దని మంత్రి తెలిపారు. మామూలుగా ప్రతీ పదేళ్లకోసారి జనాభా గణన ప్రక్రియను చేపడతామని.. గతంలో యూపీఏ సర్కారు ఎన్పీఆర్ ను 2010లో ప్రారంభించిందని.. 2020లో తాము దాన్ని అప్ డేషన్ చేస్తున్నామన్నారు. దీనికి ఎన్నార్సీతో సంబంధం లేదన్నారు. ఎన్పీఆర్ జనాభా నమోదుకు సంబంధించింది కాగా, ఎన్నార్సీ పౌరుల నమోదుకు సంబంధించిందని మంత్రి వివరించారు.  జనాభా లెక్కలకు(సెన్సస్), ఎన్పీఆర్ కు మధ్య స్వల్ప తేడా ఉందన్నారు. 2010లో ప్రారంభమైన ఎన్పీఆర్ 2020లో పూర్తవుతుందని చెపుతూ.. సెన్సస్(జనాభా లెక్కలు) 2021లో జరుగుతాయన్నారు. వీటిని  ఇంటింటికి వెళ్లి చేస్తారన్నారు.

More Telugu News