Uddhav Thackarey: రాజకీయాలను మతంతో ముడిపెట్టాం... పెద్ద తప్పు చేశాం: ఉద్ధవ్ థాకరే

  • హిందుత్వ కోసమే 25 ఏళ్లుగా బీజేపీతో కలిసున్నాం
  • పొత్తు ధర్మం గురించి మాట్లాడితే సరిపోదు
  • మాకు కాంగ్రెస్, ఎన్సీపీ అనే కొత్త మిత్రులు ఉన్నారు

రాజకీయాలను మతంతో ముడిపెట్టి ఇన్నాళ్లు పెద్ద తప్పు చేశామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో కలిసి కొనసాగడం కూడా శివసేన చేసిన మరో పెద్ద తప్పు అని అన్నారు. ఇంతకాలం పక్కా హిందుత్వ నినాదంతో రాజకీయాలను నడిపిన ఉద్ధవ్ నుంచి ఈ మాటలు రావడం చర్చనీయాంశంగా మారింది. హిందుత్వ సిద్ధాంతాన్ని శివసేన గాలికొదిలేసిందంటూ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత ఫడ్నవిస్ విమర్శించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ప్రజాతీర్పుపై ఫడ్నవిస్ మాట్లాడారని... కానీ, ఇవి రాజకీయాలని ఉద్ధవ్ అన్నారు. రాజకీయాలు జూదంలాంటివని... సరైన రీతిలోనే రాజకీయాలు చేయాలని చెప్పారు. ఈ విషయాన్ని తాము మర్చిపోయి... రాజకీయాలను మతంతో ముడిపెట్టామని, దానికి సంబంధించిన ప్రతిఫలాన్ని అనుభవించామని తెలిపారు. కేవలం హిందుత్వ సిద్ధాంతం కోసమే బీజేపీతో 25 ఏళ్లుగా తాము కలిసున్నామని చెప్పారు. తాము మతాన్ని మార్చుకోలేదని... నిన్న, ఈరోజు, రేపు కూడా తాము హిందువులమేనని చెప్పారు. మీ గురించి చెప్పాలని ఫడ్నవిస్ ను ప్రశ్నించారు. రాజకీయ అవసరాల కోసం వేర్వేరు సిద్ధాంతాలు కలిగిన మమతా బెనర్జీ, రాంవిలాస్ పాశ్వాన్, పీడీపీలతో చేయి కలిపిన చరిత్ర బీజేపీదని విమర్శించారు.

పొత్తు ధర్మం గురించి మాట్లాడితే సరిపోదని... దానికి కట్టుబడి ఉండాలని ఉద్ధవ్ అన్నారు. మతం అనేది కేవలం పుస్తకాల్లోనే ఉండరాదని... మన నిజ జీవితంలో కూడా ఉండాలని చెప్పారు.

కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బాల్ థాకరేకు మీరు ప్రామిస్ చేశారా? అని ఫడ్నవిస్ తనను ఉద్దేశించి ప్రశ్నించారని... అలాంటి ప్రామిస్ తన తండ్రికి తాను ఇవ్వలేదని ఉద్ధవ్ తెలిపారు. ఆ విషయాన్ని తాను ఎప్పుడూ, ఎక్కడా చెప్పలేదని అన్నారు. ఇచ్చిన మాటల గురించి మాట్లాడుకుంటే... వాటికి తాను ఎప్పుడూ కట్టుబడే ఉంటానని చెప్పారు. బుల్లెట్ రైళ్లలో ప్రయాణించేవారి కోసం కాకుండా రిక్షాల్లో వెళ్లే వారి కోసం తమ ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. ప్రస్తుతం తనకు కాంగ్రెస్, ఎన్సీపీ అనే కొత్త మిత్రులు ఉన్నారని చెప్పారు. అస్తవ్యస్తంగా ఉన్న జీఎస్టీ విధానంతో దేశ ఆర్థికస్థితిని కేంద్ర ప్రభుత్వం నాశనం చేసిందని ఉద్ధవ్ మండిపడ్డారు.

More Telugu News