devineni uma: అందుకే విశాఖలో కేబినెట్ మీటింగ్ పెడుతున్నారు: దేవినేని ఉమ విమర్శలు

  • తుగ్లక్ ను మించిన పరిపాలన జగన్ అందిస్తున్నారు
  • 27వ తారీఖున కేబినెట్ భేటీ పెడుతున్నారు 
  • జీఎన్ రావు కమిటీ నివేదికకు ఆమోదం తెలపాలని భావిస్తున్నారు
  • 28వ తారీఖున సెక్రటేరియట్ భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు

ఐదు కోట్ల మంది ఆంధ్ర ప్రజలను ఏపీ ముఖ్యమంత్రి జగన్ అయోమయంలో పెట్టారని టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు విమర్శించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... '700 ఏళ్ల క్రితం ఈ దేశం తుగ్గక్ పరిపాలనను చూసింది. తుగ్లక్ ను మించిన పరిపాలనను జగన్ అందిస్తున్నారు. ఆయన పిచ్చి తుగ్లక్ లా వ్యవహరిస్తున్నారు' అని అన్నారు.

'సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వచ్చి ఇక్కడ హైకోర్టు భవనానికి శంకుస్థాపన చేశారు. కమిటీని వేసి కమిటీ రిపోర్టులు బయటపెట్టకుండా 27వ తారీఖున కేబినెట్ భేటీ పెడుతున్నారు. విశాఖలో కేబినెట్ మీటింగ్ పెట్టి జీఎన్ రావు కమిటీ నివేదికకు ఆమోదం తెలపాలని భావిస్తున్నారు. 28వ తారీఖున సెక్రటేరియట్ భవనాలను శంకుస్థాపన చేయనున్నారు' అని దేవినేని ఉమ అన్నారు.

'చాలా కుట్రపూరితంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయాలని చూస్తున్నారు. విజయసాయి రెడ్డి మూడు నెలలుగా పెద్ద ఎత్తున ఆస్తులను కొట్టేశారు. ఈ తుగ్లక్ జగన్ పరిపాలన చూసి పెట్టుబడిదారులు వెనక్కి వెళ్లిపోతున్నారు. అమరావతి రైతులు త్యాగాలు చేసి భూములు ఇచ్చారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం వారికి ప్లాట్లు డెవలప్ చేసి ఇవ్వాలి' అని దేవినేని ఉమ వ్యాఖ్యానించారు.

'ఇవన్నీ పక్కకు పెట్టి తన ఆస్తులు కాపాడుకోవడానికి, కక్షతో జగన్ పార్టీ వ్యవహరిస్తోంది. మేనిఫెస్టోలో రాజధాని మారుస్తున్నట్లు చెప్పావా? హైకోర్టును మారుస్తామని చెప్పావా? జగన్ పిచ్చి తుగ్లక్ లా ప్రవర్తిస్తున్నాడు. అమరావతిలో కేబినెట్ భేటీ పెట్టే ధైర్యం లేకుండా విశాఖలో భేటీ అవుతున్నారు' అని దేవినేని ఉమ అన్నారు.

More Telugu News