ఇప్పుడు ఏపీ పరిస్థితి ఇలా ఉంది: టీడీపీ నాయకురాలు రేవతి చౌదరి

23-12-2019 Mon 17:19
  • గుండె స్థానం ఎక్కడో అక్కడే ఉండాలి 
  • దానిని తలలోనో, కాలి లోనో పెట్టుకుంటామంటే ఎలా?
  • రాజధానిగా అమరావతి నచ్చలేదని ఆ రోజునే ఎందుకు చెప్పలేదు?

ఏపీకి మూడు రాజధానుల అంశంపై టీడీపీ అధికార ప్రతినిధి రేవతి చౌదరి మాట్లాడుతూ, గుండె స్థానం ఎక్కడో అక్కడే ఉండాలి తప్ప దానిని తలలోనో, కాలి లోనో పెట్టుకుంటామంటే కుదరదని, ఇప్పుడు ఏపీ పరిస్థితి అలాగే ఉందని అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ప్రజలందరికీ అందుబాటులో ఉండాలన్న ఉద్దేశ్యంతోనే రాజధానిగా అమరావతిని నాడు చంద్రబాబు ఏర్పాటు చేశారని చెప్పారు.

నచ్చకపోతే ఈ విషయాన్ని ఆరోజునే జగన్ కానీ, బీజేపీ నేతలు కానీ ఎందుకు ప్రశ్నించలేదని అన్నారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని, రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూములు లాక్కున్నారని నాడు వైసీపీ నేతలు ఆరోపించారని, ఇప్పుడు ఆ పార్టీనే అధికారంలో ఉంది కనుక ఎవరి దగ్గర నుంచి లాక్కున్నామో ఆధారాలతో చూపించాలని డిమాండ్ చేశారు. ప్రజావేదిక కూల్చడం తప్ప వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిందేమీ లేదని విమర్శించారు.