అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలినీ పాండేపై క్రిమినల్ కేసు!

23-12-2019 Mon 13:24
  • తమిళంలో విజయ్ ఆంటోనీ సరసన నటించేందుకు ఒప్పుకున్న షాలినీ
  • షూటింగ్ కు గైర్హాజరు
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన చిత్ర నిర్మాత!

తొలి చిత్రం అర్జున్ రెడ్డితో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న ఉత్తరాది భామ షాలినీ పాండే చిక్కుల్లో పడింది. తమిళంలో విజయ్ ఆంటోనీ సరసన నటించేందుకు సంతకం చేసి, కొన్నివారాల పాటు సజావుగా సెట్స్ కి వచ్చి ఆపై షూటింగ్ ఎగవేతకు పాల్పడిందంటూ షాలినీపై చిత్రబృందం గుర్రుగా ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే చిత్ర నిర్మాత శివ అమ్మడిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, క్రిమినల్ కేసు నమోదైనట్టు తెలుస్తోంది. షాలినీపై అంతకుముందే తెలుగు, తమిళ నిర్మాతల మండలిలోనూ ఫిర్యాదు చేశారు.

కాగా, షాలినీ ఇటీవలే బాలీవుడ్ లో అదిరిపోయే చాన్స్ దక్కించుకుంది. నవతరం స్టార్ హీరో రణవీర్ సింగ్ పక్కన 'జయేశ్ భాయ్ జోర్దార్' అనే చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైంది. బాలీవుడ్ ఎంట్రీ కోసం దక్షిణాది సినిమాలను పక్కనబెడుతోందని తాజా సంఘటనతో షాలినీ పాండేపై ఆరోపణలు వినిపిస్తున్నాయి.