మంగళగిరి ఎమ్మెల్యే కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు

23-12-2019 Mon 13:09
  • రాజధాని మార్పుపై వెల్లువెత్తుతున్న నిరసనలు
  • అమరావతిలో రైతుల ధర్నాలు, నిరసనలు
  • ఇంత జరుగుతున్నా స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదన్న రైతులు

రాజధాని అమరావతిలో రైతుల నిరసనలు తీవ్రమయ్యాయి. ఏపీ ప్రభుత్వం మూడు రాజధానులు అంటూ కొత్త ప్రచారం ఎత్తుకోవడంతో అమరావతి రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గత కొన్నిరోజులుగా ముమ్మరంగా ధర్నాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో, స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కనిపించడం లేదంటూ రైతులు పోలీసులను ఆశ్రయించారు. రాజధానిపై తీవ్ర అనిశ్చితి ఏర్పడిన ప్రస్తుత తరుణంలో ఎమ్మెల్యే తమను పట్టించుకోవడంలేదంటూ వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తీవ్రస్థాయిలో ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు జరుగుతున్నా ఎమ్మెల్యే పట్టించుకోవడంలేదని వారు విమర్శించారు. కాగా, రాజధాని సెగలు క్రమంగా ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. అమరావతి రైతులకు సంఘీభావం ప్రకటిస్తూ గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పలు ప్రాంతాల్లో ధర్నాలు నిర్వహిస్తున్నారు.