రాజధానిగా విశాఖను మించిన ప్రదేశం ఏపీలో మరొకటి లేదు: ఐవైఆర్ కృష్ణారావు

22-12-2019 Sun 21:40
  • ఓ మీడియా చానల్ కు ఇంటర్వ్యూ
  • అమరావతిని వ్యతిరేకిస్తూ వస్తున్న ఐవైఆర్
  • విశాఖను లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేయాలని సూచన

ఏపీ రాజధానిగా అమరావతిని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న వ్యక్తి మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు. ఎవరి రాజధాని అమరావతి? అంటూ ఆయన విమర్శనాత్మకంగా ఓ పుస్తకం కూడా రాశారు. తాజాగా, ఏపీ రాజధాని విశాఖకు తరలిపోతుందన్న ప్రచారం నేపథ్యంలో స్పందించారు. ఓ మీడియా చానల్ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలు వెల్లడించారు. వ్యూహాత్మకంగా చూస్తే రాజధాని కోసం విశాఖను మించిన  ప్రాంతం ఏపీలో మరొకటి లేదని అన్నారు.

హైదరాబాద్, ముంబయి వంటి నగరాల స్థాయిలో  అమరావతి అభివృద్ధి చెందాలంటే మరో రెండు మూడు తరాల వరకు అవకాశమే లేదని ఐవైఆర్ అభిప్రాయపడ్డారు. అందుకు మరో వందేళ్ల పడుతుందని అన్నారు. ఆ దృష్టితో చూస్తే విశాఖనే కరెక్ట్ అని స్పష్టం చేశారు. లెజిస్లేటివ్ క్యాపిటల్ తో పాటు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ను కూడా విశాఖలోనే ఏర్పాటు చేసి, కర్నూలులో హైకోర్టు నెలకొల్పడం సబబుగా ఉంటుందని భావిస్తున్నట్టు తెలిపారు.