Visakhapatnam District: విశాఖ ఏజెన్సీ గజగజ...పడిపోతున్న ఉష్ణోగ్రతలు!

  • చలితో వణుకుతున్న ఏజెన్సీ వాసులు 
  • లంబసింగిలో 12 డిగ్రీల ఉష్ణోగ్రత 
  • అయితే గత ఏడాదితో పోల్చితే మూడు డిగ్రీల ఎక్కువ

విశాఖ ఏజెన్సీని చలి వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గిపోవడంతో ఏజెన్సీ వాసులు అల్లాడిపోతున్నారు. గడచిన రెండు రోజుల నుంచి తీవ్ర ప్రభావం కనిపిస్తోందని చెబుతున్నారు. ఆంధ్రాకశ్మీర్ గా పేరొందిన ఏజెన్సీలోని లంబసింగిలో ఏటా శీతాకాలంలో మైనస్ మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. దట్టమైన అడవిని ముద్దాడుతున్నట్లుండే మంచుతెరలు ఈ సీజన్లో కనువిందు చేస్తాయి. అందుకే దేశవిదేశాల నుంచి శీతాకాలంలో లంబసింగికి పర్యాటకులు క్యూకడతారు. ప్రస్తుత వాతావరణం పర్యాటకులను ఆకట్టుకునేట్టు ఉండడంతో భారీగా సందర్శకులు తరలివస్తున్నారు.

నిన్న ఏజెన్సీలోని పాడేరు, లంబసింగిలో 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదే విధంగా మినుములూరులో 11 డిగ్రీలు, అరకు చింతపల్లిలో 14 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాస్తవానికి గత ఏడాది ఇదే సీజన్లో రెండుమూడు డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

కానీ ఈ ఏడాది ఉత్తరాది పొడిగాలుల ప్రభావం, మేఘాలు ఆవరించడం వంటి కారణాలతో లంబసింగిలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ తెలియజేస్తోంది. అయినప్పటికీ ఏజెన్సీని కప్పేసిన మంచుతెరలు, కాళ్ల కిందన ఉన్నట్లు అనిపించే మేఘాల సోయగాలు చూసి సందర్శకులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.

More Telugu News