ప్రియుడిని చితకబాది... ప్రియురాలి పై సామూహిక అత్యాచారం!

22-12-2019 Sun 10:33
  • స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లిన యువతి 
  • మధ్యలో అడ్డుకున్న ఆరుగురు యువకులు 
  • నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపిన పోలీసులు

స్నేహితుడితో కలిసి సరదాగా బయటకు వెళ్లిన ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఆరుగురు యువకులు. ఆమె ప్రియుడిని చితకబాది, ఆమెపై అఘాయిత్యానికి తలపడ్డారు. ఎలాగోలా ప్రాణాలతో బయటపడిన బాధితులు పోలీసులను ఆశ్రయించి జరిగిన ఘోరాన్ని తెలిపారు. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి.

సీరనాయగన్నాళయానికి చెందిన యువతి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇటీవల స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లింది. మార్గమధ్యంలో ఆరుగురు దుండగులు వీరిని అటకాయించారు. ప్రియుడిని చితకబాది యువతిని ఎత్తుకుపోయారు. సామూహిక అత్యాచారం చేసి వదిలేశారు.

ప్రాణాలతో బయటపడ్డ వీరు ఎలాగోలా ఇంటికి చేరుకుని విషయం చెప్పడంతో వారంతా కలిసి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసిన పోలీసులు ప్రాథమిక విచారణ అనంతరం అదే ప్రాంతానికి చెందిన మణికంఠన్‌ (27), కార్తీ (26), రాహుల్‌ (21), ప్రకాష్‌ (22), కార్తీకేయన్‌ (28), నారాయణమూర్తి (32)లను పోక్సో చట్టం కింద అరెస్ట్‌ చేశారు. న్యాయస్థానంలో హాజరుపరచి కోర్టు ఆదేశాలమేరకు రిమాండ్ కు తరలించారు.