దేశం కోసం ప్రాణత్యాగానికి సిద్ధం: అసదుద్దీన్ ఒవైసీ

22-12-2019 Sun 09:43
  • ఎన్ఆర్‌సీ అమలు చేస్తే రాష్ట్రాలు ఖాళీ అవుతాయి
  • ప్రతీ ముస్లిం ఇంటిపైనా జాతీయ జెండా ఎగరడాన్ని మోదీ, షాలు చూడాలి
  • ఏడు దశాబ్దాల తర్వాత భారతీయులుగా నిరూపించుకోవాలా?

దేశం కోసం అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా తాను సిద్ధమని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలపై స్పందించిన ఒవైసీ.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు దాటిన తర్వాత దేశ పౌరులుగా నిరూపించుకోవాల్సి రావడం దారుణమన్నారు. దీనిని కేవలం హిందూ, ముస్లిం సమస్యగా చూడరాదని, దేశానికి ప్రజలకు మధ్య ఉన్న సమస్యగా దీనిని చూడాలని ఒవైసీ అన్నారు. ఎన్ఆర్‌సీ వల్ల దేశానికి నష్టమే తప్ప లాభం లేదన్నారు. ఎన్ఆర్‌సీని కనుక అమలు చేస్తే దేశంలో చాలా వరకు రాష్ట్రాలు ఖాళీ అయిపోతాయన్నారు.

దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని ఒవైసీ అన్నారు. దేశంలోని ప్రతీ ముస్లిం ఇంటిపైనా జాతీయ జెండా ఎగరడాన్ని మోదీ, షాలు చూడాలని అన్నారు. మహాత్మాగాంధీ మనమధ్య లేకపోయినా ఆయన జ్ఞాపకాలు ఉన్నాయని, అంబేద్కర్ లేకపోయిన ఆయన రచించిన రాజ్యాంగం మనతో ఉందని అన్నారు. దేశం కోసం అవసరమైతే ప్రాణాలు ఇవ్వడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని ఒవైసీ స్పష్టం చేశారు.