Philippines: అంతర్జాతీయ క్రిమినల్ కోర్టును ధిక్కరిస్తున్న ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు.. అసలు కారణం ఇదే!

  • డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపిన డ్యుటెర్టే
  • డ్రగ్స్ సరఫరాదారులపై కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు
  • కుప్పలుతెప్పలుగా కాల్చి చంపిన పోలీసులు
  • అంతర్జాతీయ న్యాయస్థానం ఆగ్రహం

ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టే అంతర్జాతీయ క్రిమినల్ న్యాయస్థానంపై ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. దీనివెనుక ఆసక్తికరమైన కారణం ఉంది. 2016లో రోడ్రిగో డ్యుటెర్టే ఫిలిప్పీన్స్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆయన దవావో నగర మేయర్. కాగా, దేశాధ్యక్ష స్థానంలోకి వచ్చిన తర్వాత తనకున్న విచక్షణాధికారాలను ఉపయోగించి డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపారు. డ్రగ్స్ సరఫరాదారులను కనిపిస్తే కాల్చివేయాల్సిందిగా పోలీసులను ఆదేశించారు. ఎలాంటి విచారణ అవసరంలేదని పోలీసులను ప్రోత్సహించారు. దాంతో కొద్దికాలంలోనే వేలమంది హతులయ్యారు. అక్కడి ఆసుపత్రుల్లోని మార్చురీలు సైతం శవాలతో నిండిపోయాయి.

ఈ పరిస్థితి ఫిలిప్పీన్స్ మానవ హక్కుల సంఘాలతో పాటు, అంతర్జాతీయ సమాజాన్ని కూడా దిగ్భ్రాంతికి గురిచేసింది. హేగ్ లోని అంతర్జాతీయ న్యాయస్థానం ప్రాథమిక విచారణ జరిపింది. దాంతో అంతర్జాతీయ న్యాయస్థానం నుంచి ఫిలిప్పీన్స్ తప్పుకుంటున్నట్టు అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టే ప్రకటించారు. వాస్తవానికి ఈ ప్రక్రియకు పార్లమెంటు ఆమోదం తప్పనిసరి అయినా స్వీయ విచక్షణతో నిర్ణయం తీసుకున్నారు. తాజాగా దీనిపై స్పందిస్తూ, తనను ఉరితీసినా సరే, జైలుశిక్ష విధించినా సరే అంతర్జాయ చట్టాలకు తలొగ్గేది లేదని, అంతర్జాతీయ క్రిమినల్ న్యాయస్థానానికి జవాబు చెప్పేది లేదని స్పష్టం చేశారు.

More Telugu News