Andhra Pradesh: ఇక్కడి ప్రభుత్వం చేసే పిచ్చి పనుల్లో కేంద్రం జోక్యం చేసుకోదు!: కన్నా లక్ష్మీనారాయణ

  • తాము అభివృద్ది వికేంద్రీకరణనే కోరుకున్నామని వెల్లడి
  • పరిపాలన వికేంద్రీకరణను కోరుకోలేదని స్పష్టీకరణ
  • ప్రభుత్వం చేసే పిచ్చి పనుల్లో కేంద్రం జోక్యం చేసుకోదన్న కన్నా

ఏపీ రాజధాని అంశంపై రాష్ట్ర బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. రాజధానిపై తమ వైఖరి గురించి చెబుతూ, తాము అభివృద్ధి వికేంద్రీకరణనే కోరుకున్నాము తప్ప పరిపాలనా వికేంద్రీకరణను కాదని స్పష్టం చేశారు. అయితే, ఇక్కడి ప్రభుత్వం చేసే పిచ్చి పనుల్లో కేంద్రం జోక్యం చేసుకోదని కన్నా తెలిపారు. రాష్ట్రంలో తీసుకునే నిర్ణయాలకు ముఖ్యమంత్రే బాధ్యత వహిస్తాడని అన్నారు.

రాజధాని మారడం అనేది తనకు తెలిసినంతవరకు చరిత్రలో ఎక్కడా చూడలేదని, సీఎం మారినప్పుడల్లా రాజధాని మారుతుందనేది జగన్ నాయకత్వంలో మొదటిసారి చూస్తున్నానని వ్యాఖ్యానించారు. రాజధానిపై వైసీపీ నిర్ణయం తీసుకుంటే సరిపోతుందా, సీఎం మారితే ప్రభుత్వ విధానాలు మారతాయా? అంటూ కన్నా అసహనం వ్యక్తం చేశారు.

'ఒకరు మూడు రాజధానులంటారు, మరొకాయన పదంటారు, ఇంకొకరు పదిహేనంటారు... ఇష్టంవచ్చినట్టు రాజధానిని మార్చే హక్కు ప్రజలు ఇవ్వలేదు' అంటూ మండిపడ్డారు. ఏదేమైనా ఈ నిర్ణయం రాష్ట్ర అభివృద్ధికి మంచిది కాదని అభిప్రాయపడ్డారు. ప్రజాధనాన్ని ఇష్టంవచ్చినట్టు దుర్వినియోగం చేయొద్దని హితవు పలికారు. 150 సీట్లు ఉండి కూడా జగన్ అభద్రతాభావంలో ఉన్నాడని కన్నా విమర్శించారు. ఏ కారణంతో జగన్ భయపడుతున్నాడో తమకు అర్థంకావడం లేదని అన్నారు.

చంద్రబాబుపై ఉన్న కక్షతో ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ఏంటని ప్రశ్నించారు. రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని భావిస్తే, ఈ ఆర్నెల్లలో ఏంచేశారని నిలదీశారు. అవినీతిపరులపై చర్యలు తీసుకోకుండా ప్రజలను బాధించే చర్యలకు దిగడం సరికాదని అభిప్రాయపడ్డారు. వైసీపీది మాటల ప్రభుత్వమేనని, జగన్ పాలనలో రాష్ట్రాభివృద్ధి ఓ కలేనని అర్థమవుతోందని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News