Facebook users: హ్యాకర్ల చేతుల్లో.. ఫేస్ బుక్ ఖాతాదార్ల సమాచారం

  • 26.7 కోట్ల మంది ఫేస్ బుక్ ఖాతాదారుల వ్యక్తిగత డేటాకు ముప్పు
  • కంపెయిర్‌టెక్‌, సెక్యూరిటీ పరిశోధకుడు బాబ్‌ దియచెంకో వెల్లడి
  • మార్పులు చేపట్టకముందు ఇది జరిగి ఉంటుందన్న ఫేస్ బుక్

ప్రపంచవ్యాప్తంగా ఆదరణ చూరగొంటున్న సామాజిక వెబ్ సైట్ తన ఖాతాదారుల వ్యక్తిగత సమాచారానికి భద్రత చేకూర్చలేకపోతోందనే అపవాదును ఎదుర్కొంటున్న నేపథ్యంలో..తాజాగా ఈ వాదనకు బలం చేకూర్చే నివేదిక ఒకటి విడుదలైంది. కంపెయిర్టెక్, సెక్యూరిటీ పరిశోధకుడు బాబ్ దియచెంకో రూపొందించిన ఈ నివేదికలో 26.7 కోట్ల మంది ఫేస్ బుక్ ఖాతాదారుల వ్యక్తిగత డేటా(యూజర్ ఐడీలు, పేర్లు, ఫోన్ నంబర్లు..) లీకయిందన్నారు. ఇదంతా ఓ డేటాబేస్ ఆన్ లైన్ లో నిక్షిప్తమైందని పేర్కొన్నారు.

ఈ డేటాబేస్ ను ఎవరైనాసరే ఆన్ లైన్ లో పాస్ వర్డ్ లేకుండా యాక్సెస్ చేయవచ్చని తెలిపారు. ఎస్ఎంఎస్ స్పామ్స్, ఫిషింగ్ దాడులకోసం ఈ డేటాను దుర్వినియోగం చేసే అవకాశం కూడా ఉందని వెల్లడించారు. డేటా లీక్ గురించి తెలియగానే డేటాబేస్ ఐపీ అడ్రస్ ల ద్వారా అన్ని సర్వర్ల నుంచి తొలగించేందుకు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ను దియచెంకో సంప్రదించారు. అయితే డేటాబేస్ యాక్సెస్ ను సర్వీస్ ప్రొవైడర్ నిరోధించడానికి రెండు వారాల ముందే ఈ డేటాబేస్ ఆన్ లైన్ లో పోస్ట్ చేయబడిందని గుర్తించారు.

ఈ డేటాను ఎవరైనా డౌన్ లోడ్ చేసుకునే వీలుంది. దీనిపై ఫేస్ బుక్ యాజమాన్యం స్పందిస్తూ.. యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని కాపాడేందుకు తాము మార్పులు చేపట్టకముందు ఇది జరిగి ఉంటుందని తెలిపింది. ఇదిలా ఉండగా, డేటాబేస్ లీక్ పై దియచెంకో వివరిస్తూ.. ఫేస్ బుక్ ఏపీఐలో భద్రతా లోపాల కారణంగానే హ్యాకర్లు ఈ పనికి పాల్పడి ఉంటారని పేర్కొన్నారు.

More Telugu News