CAA contents are same as former PM Manmohan Singh said in Rajya Sabha in 2003: పౌరసత్వంపై నాడు మన్మోహన్ చెప్పింది ఇదే కదా?: బీజేపీ

  • రాజ్యసభలో మన్మోహన్ పౌరసత్వ చట్టానికి అనుకూలంగా మాట్లాడిన వీడియో పోస్ట్
  • మన్మోహన్ చెప్పిన అంశాలే సీఏఏలో ఉన్నాయని వెల్లడి
  • పాక్, బంగ్లాదేశ్ ల నుంచి వచ్చిన మైనారిటీలకు మద్దతుగా ప్రసంగించారన్న బీజేపీ

2003లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో పౌరసత్వ చట్టంపై మాట్లాడిన అంశాలే ప్రస్తుతం తాము రూపొందించిన పౌరసత్వ సవరణ చట్టంలో ఉన్నాయని బీజేపీ పేర్కొంది.  పౌరసత్వ సవరణ చట్టంపై దేశంలో  కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సవరణ చట్టంపై  దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. మన్మోహన్ మాట్లాడిన అప్పటి వీడియోను బీజేపీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో మన్మోహన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన మైనారిటీలకు పౌరసత్వం కల్పించడానికి మద్దతుగా ప్రసంగించారని బీజేపీ పేర్కొంటూ.. ప్రస్తుతం తమ ప్రభుత్వం అదే చేసిందని క్యాప్షన్ పెట్టింది.

‘2003లో రాజ్యసభలో నాటి ప్రతిపక్ష నేత మన్మోహన్ సింగ్ పొరుగుదేశాలైన పాకిస్థాన్, బంగ్లాదేశ్ మతపరమైన పీడనకు గురైన మైనారిటీలకు పౌరసత్వం కల్పించే విషయంలో ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించాలి అని అన్నారు. ప్రస్తుత పౌరసత్వ సవరణ చట్టం అదే చేసింది’ అని బీజేపీ వీడియోకు అనుబంధంగా వ్యాఖ్యలను జోడించింది.

ఈ వీడియోలో మన్మోహన్ సింగ్ అప్పటి హోం మంత్రి ఎల్ కే అద్వానీని ఉద్దేశించి మాట్లాడారు. ‘నేను శరణార్థులకు సంబంధించి ఒక విషయం చెప్పదల్చుకున్నాను. దేశ విభజన తర్వాత బంగ్లాదేశ్ వంటి దేశాల్లోని మైనారిటీలు మతపరమైన పీడనను ఎదుర్కొన్నారు. ఆ సమయంలో పరిస్థితుల ప్రభావంతో వారంతా శరణార్థులగా మనదేశానికి వస్తే పౌరసత్వం కల్పించడంపై మరింత ఉదారంగా వ్యవహరించాలి. గౌరవనీయులైన ఉప ప్రధాన మంత్రి ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని భవిష్యత్తులో దాని కనుగుణంగా పౌరసత్వ చట్టాన్ని రూపొందిస్తారని భావిస్తున్నాను’ అని మన్మోహన్ చెప్పారు.

More Telugu News