Railway minister: అటువంటి వారిని అక్కడే కాల్చిపారేయాలి: కేంద్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

  • ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే వారిని కాల్చిపడేయాలి
  • అధికారులకు అదే చెప్పాను
  • రైల్వే శాఖ సహాయ మంత్రి సురేశ్ అంగాడీ
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలపై రైల్వే శాఖ సహాయ మంత్రి  సురేశ్ అంగాడీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిరసనల్లో భాగంగా ఎవరైనా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే వారిని అక్కడికక్కడే కాల్చి పడేయాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిరసనల్లో భాగంగా పశ్చిమబెంగాల్‌లో కొందరు ఆందోళనకారులు ముర్షీదాబాద్ రైల్వేస్టేషన్‌కు నిప్పు పెట్టారు. దీనిపై తీవ్రంగా స్పందించిన మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రజల ఆస్తిని ధ్వంసం చేసే ఎవరినైనా కాల్చి పడేయాలని కేంద్ర మంత్రిగా తాను అధికారులకు చెప్పినట్టు అంగాడీ తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లో రైల్వే శాఖ ఇప్పటికే తీవ్ర నష్టాల్లో ఉందని, ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగిస్తే చూస్తూ ఊరుకునేది లేదని మంత్రి హెచ్చరించారు. రైల్వేల అభివృద్ధికి 13 లక్షల మంది రాత్రీపగలు కష్టపడుతుంటే, కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు ప్రతిపక్షాల మద్దతుతో సమస్యలు సృష్టిస్తున్నాయని అన్నారు. కాగా, మంత్రి వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది.
Railway minister
suresh angadi

More Telugu News