Kanna: అనుభవంలేని వ్యక్తి సీఎంగా రావడం ప్రజల దౌర్భాగ్యం: జగన్ పై కన్నా విమర్శలు

  • ఏపీలో మతమార్పిళ్లు తప్ప మరేం జరగడంలేదన్న కన్నా
  • జగన్ మద్దతుతో మరింతగా మతమార్పిళ్లు జరుగుతున్నాయని వ్యాఖ్యలు
  • జగన్ లో మార్పు రాలేదని విమర్శలు

సీఎం జగన్ పై ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మతమార్పిళ్లు తప్ప మరేమీ జరగడం లేదని విమర్శించారు. ఏమాత్రం అనుభవంలేని వ్యక్తి సీఎంగా రావడం ఏపీ ప్రజల దౌర్భాగ్యం అని అభివర్ణించారు. తిరుపతి సహా అనేక హిందూ దేవాలయాల్లో క్రైస్తవులు తిష్టవేశారని, గతంలో గుట్టుగా సాగిన మతమార్పిళ్లు నేడు జగన్ మద్దతు కారణంగా బహిరంగంగా సాగుతున్నాయని విమర్శించారు. జగన్ ప్రభుత్వం హిందువులకు పూర్తి వ్యతిరేకమని ఆరోపించారు. హిందూ దేవాలయాల్లో అరాచకాలు జరుగుతున్నాయని అప్పటి సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం చెబితే ఆయన్ను తొలగించారు తప్ప జగన్ లో మార్పు రాలేదని అన్నారు.

చివరికి భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడ్ని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే పరిస్థితికి వచ్చారని కన్నా వ్యాఖ్యానించారు. ఏపీ ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుండడం పట్ల కూడా ఆయన స్పందించారు. తెలుగు భాషకు ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర ఉందని, ఎంతోమంది పోరాటాల ఫలితంగా ఈ స్థితికి చేరుకున్న తెలుగును చంపాలని చూస్తున్న జగన్ కు కూడా చంద్రబాబుకు పట్టిన గతే పడుతుందని అన్నారు. మాతృభాషను చంపడం అంటే కన్నతల్లిని చంపుకోవడమేనని అభిప్రాయపడ్డారు.

More Telugu News