AP Assembly: భాస్కర్ నాయుడు మీకు ఏ విధంగా బంధువు అవుతాడో చెప్పమంటారా?: చంద్రబాబుపై సీఎం జగన్ విసుర్లు

  • ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు
  • అవుట్ సోర్సింగ్ వ్యవస్థపై జగన్ ప్రసంగం
  • టీడీపీపై ఆరోపణలు, విమర్శలు

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా సభలో అవుట్ సోర్సింగ్ అంశం అధికార, విపక్ష సభ్యుల మధ్య ఆగ్రహావేశాలకు దారితీసింది. గత ప్రభుత్వ హయాంలో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టుల ద్వారా ఇష్టంవచ్చినట్టు దోచుకున్నారని సీఎం జగన్ తన ప్రసంగంలో ఆరోపించారు. చంద్రబాబు బంధువు భాస్కర్ నాయుడికి కూడా ఆలయాల్లో పారిశుద్ధ్య పనుల అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఇచ్చింది నిజం కాదా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో, భాస్కర్ నాయుడు ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాడో, ఆయన మీకు ఏ విధంగా బంధువు అవుతాడో డీటెయిల్స్ చెప్పమంటారా? అంటూ చంద్రబాబును ఉద్దేశించి జగన్ వ్యాఖ్యానించారు.

అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టుల్లో చంద్రబాబు, టీడీపీ నేతలకు సంబంధించిన వాళ్లే లబ్ది పొందారని జగన్ వ్యాఖ్యానించారు. కానీ, తాము అవుట్ సోర్సింగ్ వ్యవస్థను ప్రక్షాళనం చేస్తూ సరికొత్త వ్యవస్థను తీసుకువస్తుంటే టీడీపీ నేతలు దిక్కుమాలిన అబద్ధాలు చెబుతూ రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతోనే ఏపీ కార్పొరేషన్ ఫర్ అవుట్ సోర్సింగ్ సర్వీసెస్ ను ఏర్పాటు చేశామని సీఎం జగన్ స్పష్టం చేశారు. సభలోకి వచ్చి పచ్చి అబద్ధాలు చెప్పే వ్యక్తులకు ప్రివిలేజెస్ మోషన్ ఇవ్వక ఇంకేం ఇవ్వాలని ప్రశ్నించారు.

More Telugu News