YS Viveka: వివేకా హత్యకేసుపై సీల్డ్ కవర్ లో నివేదిక ఇవ్వండి!: 'సిట్'కు హైకోర్టు ఆదేశం

  • ఎన్నికల ముందు సంచలనం సృష్టించిన వివేకా హత్య కేసు
  • హైకోర్టులో టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి పిటిషన్
  • సీల్డ్ కవర్ లో నివేదిక ఇవ్వాలని సిట్ ను ఆదేశించిన న్యాయస్థానం

ఎన్నికల ముందు రాష్ట్రంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య సంచలనం సృష్టించింది. అత్యంత దారుణమైన రీతిలో ఆయనను దుండగులు అంతమొందించారు. ఈ కేసు ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. సిట్ దర్యాప్తు చేస్తున్నా నిందితులెవరన్న దానిపై స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో, టీడీపీ నేత బీటెక్ రవి వివేకా హత్యకేసును సీబీఐకి అప్పగించాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై హైకోర్టు ఈ రోజు విచారణ నిర్వహించింది.

ఈ నెల 23వ తేదీ లోపు దర్యాప్తు వివరాలను ఓ నివేదిక రూపంలో పొందపరిచి సీల్డ్ కవర్ లో తమకు సమర్పించాలని సిట్ ను ఆదేశించింది. ఆ నివేదికను తమతో పాటు ప్రభుత్వానికి కూడా అందివ్వాలని పేర్కొంది. పిటిషన్ పై తదుపరి విచారణను జనవరి 3కి వాయిదా వేసింది.

కాగా, ఈ హత్యకేసులో సిట్ అధికారులు ఇటీవలే బీటెక్ రవిని కూడా విచారించారు. హత్య జరిగిన సమయంలో మీరు ఎక్కడున్నారు? హత్య జరిగిన విషయం మీకు ఎలా తెలిసింది? అంటూ ప్రశ్నించారు.

More Telugu News