New Delhi: కష్ట సమయంలో విద్యార్థులకు అండగా ఉంటా: జామియా మిలియా ఇస్లామియా వర్సిటీ వీసీ భరోసా

  • పౌరసత్వ సవరణ చట్టంపై ఢిల్లీలో ఆందోళనకు దిగిన విద్యార్థులు 
  • ఈ సందర్భంగా హింసాత్మక పరిస్థితులు 
  • ఘటనలపై స్పందించిన ఉప కులపతి నజ్మా అక్తర్

కష్ట సమయంలో జామియా మిలియా ఇస్లామియా (జేఎంఐ) విద్యార్థులకు అండగా ఉంటామని వర్సిటీ ఉప కులపతి నజ్మా అక్తర్ ప్రకటించారు. విద్యార్థుల ఆందోళన నేపధ్యంలో పోలీసుల తీరును వీసీ ఖండించారు. విద్యార్థులకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిన్న దేశరాజధాని ఢిల్లీలో ఈ వర్సిటీ విద్యార్థులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. ఆందోళన కారులు మూడు బస్సులు, ఇతర వాహనాలను తగులబెట్టారు.

ఈ సందర్భంగా వీసీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. పోలీసులు అనుమతిలేకుండా విశ్వవిద్యాలయం ప్రాంగణంలోకి ప్రవేశించారని, విద్యార్థుల తరగతి గదుల్లోకి ప్రవేశించి వెంబడించి మరీ కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లైబ్రరీలో చదువుకుంటున్న విద్యార్థులపై కూడా దాడులు చేశారన్నారు.

ఇటువంటి కష్ట సమయంలో విద్యార్థులు తాము ఒంటరి వారమని భయపడాల్సిన అవసరం లేదని, జామియా మొత్తం మీకు అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. కాగా, ఢిల్లీ విద్యార్థుల ఆందోళన సెగలు దేశంలోని ఇతర యూనివర్శిటీలకు కూడా విస్తరిస్తుండడంతో అప్రమత్తమైన పోలీసులు నిన్న అదుపులోకి తీసుకున్న యూనివర్శిటీ విద్యార్థులను ఈ రోజు ఉదయం విడిచిపెట్టారు.

More Telugu News