ప్రస్తుతానికైతే మా పార్టీ భవిష్యత్తు లేని పార్టీగానే ఉంది: జనసేన ఎమ్మెల్యే రాపాక

14-12-2019 Sat 16:17
  • పార్టీ కేడర్ ను బలోపేతం చేసుకోవాలి
  • అన్నిటికీ అధినేతే ఆందోళన చేస్తే ప్రయోజనం లేదు
  • సీఎం కావాలనే సంకల్పం పవన్ లో ఉండాలి

జనసేన పార్టీ నుంచి తనకు షోకాజ్ నోటీసు వచ్చినట్టు... దానిపై తాను స్పందించినట్టుగా వస్తున్న వార్తలన్నీ ఫేక్ వార్తలేనని ఆ పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ స్పష్టం చేశారు. తాను జనసేనలోనే ఉన్నానని తెలిపారు. కింది స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కేడర్ ను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని... సమస్యలపై కేడర్ స్పందించేలా బాధ్యతను అప్పగించాలని చెప్పారు. అన్ని సమస్యలకు జనసేనాని పవన్ కల్యాణ్ మాత్రమే హాజరవుతుంటే... పార్టీ బలోపేతం కాదని అన్నారు. ముఖ్యమంత్రి కావాలనే బలమైన సంకల్పం పవన్ లో ఉండాలని... అప్పుడే పార్టీ ముందుకు సాగుతుందని చెప్పారు. ప్రతి దానికి అధినేతే వచ్చి ఆందోళన చేయడం సరికాదని అన్నారు. ప్రస్తుతానికైతే భవిష్యత్తు లేని పార్టీగానే జనసేన ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.