టీఆర్ఎస్ ఎంతో బలిమితో ఉంది, కేసీఆర్ కుటుంబం అంతకన్నా కలిమితో ఉంది: విజయశాంతి

13-12-2019 Fri 20:57
  • సీఎం కేసీఆర్ పై విజయశాంతి విమర్శలు
  • ఫేస్ బుక్ లో పోస్టు
  • రాష్ట్రాన్ని అప్పులపాల్జేశారంటూ వ్యాఖ్యలు

సీఎం కేసీఆర్ పైనా, టీఆర్ఎస్ సర్కారుపైనా తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి విమర్శనాస్త్రాలు సంధించారు. రెండోసారి అధికారం చేపట్టాక టీఆర్ఎస్ పార్టీ బలిమితో ఉందని, కేసీఆర్ కుటుంబం అంతకన్నా కలిమితో ఉందని వ్యాఖ్యానించారు. ఇది తెలంగాణ ప్రజల అభిప్రాయమని తెలిపారు. ఖర్చులు తగ్గించుకోవాలంటూ వివిధ ప్రభుత్వ శాఖలకు చెబుతున్న కేసీఆర్, ముఖ్యమంత్రిగా తన దుబారా ఏమేర తగ్గించుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర ఖజానాను అప్పులపాలు చేశారని, మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రంగా ప్రస్థానం ప్రారంభించిన తెలంగాణ ఇవాళ కేసీఆర్ పాలనతో ఊబిలో కూరుకుపోయిందని విమర్శించారు. ఇంతకాలం ప్రజలను మభ్యపెట్టి కేసీఆర్ చేసిన తప్పులు క్రమంగా వెలుగులోకి వచ్చే రోజు త్వరలోనే వస్తుందని పేర్కొన్నారు. ఇంతకాలం మాయమాటలు చెప్పిన కేసీఆర్ రాష్ట్ర ఆర్థికస్థితిపై ఇప్పటికైనా నిజం ఒప్పుకోక తప్పదని ఫేస్ బుక్ లో పోస్టు చేశారు.