Rahul Gandhi: 'రాహుల్ గాంధీని శిక్షించాల్సిందే' అంటూ లోక్ సభలో కన్నీరు పెట్టుకున్న స్మృతీ ఇరానీ!

  • మేకిన్ ఇండియాను రేపిన్ ఇండియాతో పోల్చిన రాహుల్
  • బీజేపీ నేతల నుంచి బాలికలను ఎవరు కాపాడతారని ప్రశ్న
  • లోక్ సభలో రాహుల్ వ్యాఖ్యలపై దుమారం

"మేకిన్ ఇండియాను రాహుల్ గాంధీ రేప్ లతో పోల్చారు. ఓ బాధ్యతాయుతమైన రాజకీయ నేతగా ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం. ఇదేనా రాహుల్ దేశ ప్రజలకు ఇచ్చే సందేశం? ఆయనకు తగిన శిక్ష పడాల్సిందే" అని కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ, నేడు లోక్ సభలో తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇండియాలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ప్రస్తావిస్తున్న సమయంలో ఆమె కన్నీరు పెట్టుకోవడం కనిపించింది.

నిన్న రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు నేడు సభలో పెను దుమారాన్ని రేపాయి. జార్ఖండ్ లో జరిగిన ఓ ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, "మోదీ ఏమో బేటీ బచావో, బేటీ పటావో అంటారు. మరి బాలికలను కాపాడేదెవరు? బాలికలను బీజేపీ ఎమ్మెల్యేల నుంచి కాపాడాలి. మేకిన్ ఇండియాను రేప్ ఇన్ ఇండియాగా మార్చేశారు" అని నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే.

నేటి ఉదయం లోక్ సభ ప్రారంభం కాగానే, రాహుల్ వ్యాఖ్యల ప్రస్తావన వచ్చింది. బీజేపీ మహిళా ఎంపీలు రాహుల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేయడం, అందుకు ప్రతిగా కాంగ్రెస్ తదితర విపక్షాలు నినాదాలు ప్రారంభించడంతో సభలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ మాట్లాడుతూ, రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, ఆయన సభలో క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆపై సభ ఎంత సేపటికీ అదుపులోకి రాకపోవడంతో మధ్యాహ్నానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.

More Telugu News