KA Paul: ఇబ్బందుల్లో ఉన్నామంటూ జీవితా రాజశేఖర్ గతంలో నా వద్ద డబ్బులు తీసుకున్నారు: కేఏ పాల్ ఆరోపణలు

  • అమ్మరాజ్యంలో కడప బిడ్డలు చిత్రంపై వర్మ వ్యాఖ్యలు
  • సెన్సార్ బోర్డు స్పందించకపోవడంతో హైకోర్టుకు వెళ్లామన్న పాల్
  • జీవిత ఎంత డబ్బు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్

అమ్మరాజ్యంలో కడప బిడ్డలు చిత్ర వివాదంపై క్రైస్తవ మత బోధకుడు కేఏ పాల్ తీవ్రస్థాయిలో స్పందించారు. తమకు మోసం జరిగిందని, వర్మపై పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు.

 ఓ వీడియోలో ఆయన మాట్లాడుతూ, అక్టోబరు 30న వర్మ చిత్రంపై సెన్సార్ బోర్డుకు లేఖ రాశామని వెల్లడించారు. సెన్సార్ బోర్డు స్పందించకపోవడంతో తాము హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని చెప్పారు. తనను ఉద్దేశించిన సీన్లు తొలగించిన తర్వాతే ఆ చిత్రాన్ని విడుదల చేయాలంటూ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. దాంతో సెన్సార్ బోర్డు ఆ సినిమాకు భారీ స్థాయిలో కత్తెర్లు వేయాల్సిన అవసరం ఉందని పేర్కొనడంతో వర్మ తన చిత్రాన్ని రివ్యూ కమిటీకి పంపారని పాల్ వెల్లడించారు.

"ఆ రివ్యూ కమిటీ ఎవరిదో కాదు, జీవితా రాజశేఖర్ దే. ఇంతవరకు జీవిత గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. జీవిత రివ్యూ కమిటీ సభ్యురాలే కాదు వైసీపీ నేత కూడా. వాళ్లు కమ్మరాజ్యంలో కడప రెడ్లు అనే పేరు మార్చేసి రెండుమూడు కట్స్ తో వదిలేశారు. ఆ విధంగా వర్మ తన సినిమాకు పూర్తిగా సెన్సార్ సర్టిపికెట్ తీసేసుకున్నాడు.

ఇదే జీవితా రాజశేఖర్ 2012లో నా సినిమాకు సెన్సార్ చేయిస్తామన్నారు. ఆ సమయంలో... డబ్బులు లేవు, మేం చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, అప్పులోళ్లు ఇంటి వద్దకు వస్తున్నారు. ఓ రూ.10 లక్షలు ఇవ్వండి అని అడిగితే నా దగ్గర డబ్బుంది కాబట్టి రూ.20 లక్షలు ఇచ్చాను. ఇంతవరకు ఆ డబ్బులు ఇవ్వలేదు. రెండు లక్షలు ఇవ్వడంతో కోర్టు కేసులు కూడా అయ్యాయి. నేనే ఆ విషయం అంతటితో వదిలేయాలని మా అసిస్టెంట్లతో చెప్పాను. ఇప్పుడు వారు అమ్మరాజ్యంలో కడప బిడ్డలు సినిమా సెన్సార్ సర్టిఫికెట్ కోసం ఎంత డబ్బు తీసుకున్నారో వెల్లడించాలి. ఈ సినిమా కోసం వైసీపీ వాళ్లు వర్మకు రూ.50 కోట్లు ఇచ్చారా? ఇవ్వకపోతే సీఎంను మహారాజులా చూపించి, మిగతా పార్టీల నాయకులను జోకర్లలా ఎందుకు చూపించినట్టు?"  అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News