జగన్ గారికి చిత్తశుద్ధి ఉంటే వారికి శిక్ష విధించాలి: బుద్ధా వెంకన్న

10-12-2019 Tue 13:13
  • 70 శాతం నేరచరిత్ర ఉన్న నాయకులు ఉన్న పార్టీ వైకాపానే
  • వైకాపా పాలనలో 30 మంది మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు  
  • ఒక్క మహిళకైనా న్యాయం జరిగిందా?  
  • ఒక్క మృగాడికైనా శిక్ష పడిందా?  

దేశాన్ని కుదిపేసిన దిశ ఘటన గురించి కనీస అవగాహన లేకుండా అసెంబ్లీలో ఏపీ సీఎం జగన్ మాట్లాడటం చూసి మహిళల భద్రతపై వైకాపా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో రాష్ట్రంలో ఉన్న మహిళలకు అర్థమయిందంటూ టీడీపీ నేత బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు. 70 శాతం నేరచరిత్ర ఉన్న నాయకులు ఉన్న పార్టీ దేశంలో ఒక్క వైకాపానే అని సర్వే రిపోర్టులు బయటపెట్టాయని ఆయన అన్నారు.

ఆరు నెలల వైకాపా పాలనలో 30 మంది మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు జరిగాయని బుద్ధా వెంకన్న అన్నారు. ఒక్క మహిళకైనా న్యాయం జరిగిందా? అని ప్రశ్నించారు. ఒక్క మృగాడికైనా శిక్ష పడిందా? అని నిలదీశారు. స్వయంగా వైకాపా కార్యకర్తలు, నాయకులే కొన్ని కేసుల్లో నిందితులుగా ఉన్నారని ఆయన అన్నారు.

'జగన్ గారికి చిత్తశుద్ధి ఉంటే వారికి శిక్ష విధించాలి. రేప్ కేసు ఉన్న వ్యక్తికి ఎంపీ సీటు, వరకట్న వేధింపుల కేసు ఉన్న వ్యక్తికి ఎంపీ సీటు, మహిళలను వేధించిన ఐదుగురికి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన జగన్ గారు, విజయసాయి రెడ్డిగారు, మహిళలకు రక్షణ కల్పిస్తామని మాట్లాడటం చూస్తే చాలా వింతగా ఉంది' అని బుద్ధా వెంకన్న ట్వీట్లు చేశారు.