గాంధీ ఆసుపత్రికి చేరిన దిశ కేసు నిందితుల మృతదేహాలు

10-12-2019 Tue 12:27
  • సోమవారం రాత్రి గాంధీకి చేరిన మృతదేహాలు
  • శుక్రవారం వరకూ ఇక్కడే
  • గురువారం మరోసారి కేసు విచారణ
దిశ కేసులో చటాన్ పల్లి ఎన్ కౌంటర్ లో మరణించిన నలుగురు నిందితుల మృత దేహాలు గాంధీ ఆసుపత్రికి చేరాయి. దిశ అత్యాచార ఘటన అనంతరం జరిగిన ఎన్ కౌంటర్ లో నిందితులు నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. పలు సందేహాలను తెరపైకి తెచ్చిన ఈ ఎన్ కౌంటర్ పై  ఓవైపు జాతీయ మానవ హక్కుల కమిషన్, మరోవైపు తెలంగాణ హైకోర్టు విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా శుక్రవారం వరకూ మృత దేహాలను భద్రపరచాలని సోమవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గురువారం మరోసారి ఈ కేసు విచారణ కొనసాగుతుంది.

హైకోర్టు ఆదేశాల మేరకు మహబూబ్ నగర్ ఆసుప్రతి నుంచి ప్రత్యేక అంబులెన్స్ లలో తగిన బందోబస్త్ మధ్య సోమవారం రాత్రి  మృత దేహాలను సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం వరకూ మృతదేహాలను భద్రపరచాల్సి ఉన్నందున అవి పాడవకుండా తగిన ఏర్పాట్లు చేశారు గాంధీ వైద్యులు. అలాగే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు నిందితుల డెడ్ బాడీలను ఉంచిన ప్రాంతంలో తగిన భద్రతను కల్పించారు.