ఇంగ్లీషులో మాట్లాడిందని చంపేశాడు... ఆకలేయడంతో మెదడు అన్నంలో కలుపుకుని తినేశాడు!

07-12-2019 Sat 21:36
  • ఫిలిప్పీన్స్ లో దారుణం
  • పరిచయంలేని యువతిని చంపిన యువకుడు
  • పోలీసుల విచారణలో నమ్మలేని నిజాలు

ఫిలిప్పీన్స్ లో ఒళ్లు గగుర్పొడిచే ఘోరం చోటుచేసుకుంది. ఓ ఉన్మాది మహిళను చంపి ఆమె మెదడును తిన్న ఘటన సంచలనం సృష్టించింది. ఇటీవల ఫిలిప్పీన్స్ లోని బరంగాయ్ పుంతా అనే పట్టణంలో రోడ్డు పక్కనే మహిళ మృతదేహం కనిపించింది. తల లేకుండా ఉన్న ఆ మృతదేహం పోలీసులకు సవాలుగా మారింది. అయితే పోలీసు కుక్కలు ఘటన స్థలం నుంచి వాసన చూసుకుంటూ అక్కడికి కొద్ది దూరంలోని బాగ్టాంగ్ అనే యువకుడి నివాసం వద్ద ఆగాయి.

ఆ ఇంటికి తాళం వేసి ఉండడంతో ఇరుగుపొరుగును విచారించారు. బాగ్టాంగ్ ఎంతో హడావుడిగా బయటికి వెళ్లడం చూశామని పక్కింటివాళ్లు చెప్పారు. అతడే నిందితుడని ప్రాథమికంగా అంచనా వేసిన పోలీసులు గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు అతడు దొరకడంతో తమదైన శైలిలో విచారించారు. ఆ మహిళను చంపడానికి బాగ్టాంగ్ చెప్పిన కారణాలు విని పోలీసులకు మతిపోయింది.

తనకు ఇంగ్లీషు భాష అంటే అసహ్యం అని, కానీ ఆమె తనతో ఇంగ్లీషులో మాట్లాడడంతో తట్టుకోలేక హతమార్చానని, ఆపై ఆకలిగా అనిపించడంతో ఆమె తల నుంచి మెదడు వేరుచేసి అన్నంతో పాటు వండుకుని తినేశానని వెల్లడించాడు. తాను చంపిన యువతి ఎవరో తనకు తెలియదని చెప్పాడు. బాగ్టాంగ్ చెప్పిన విషయాలు విన్న తర్వాత అతడో సైకో అని పోలీసులు తేల్చారు.