Tamil Nadu: చోరీకని వెళ్లి అక్కడే గుర్రు పెట్టి నిద్రపోయిన దొంగ!

  • గస్తీ పోలీసులకు చిక్కిన భలే దొంగ
  • మద్యం మత్తుతో నిద్రలోకి
  • విషయం తెలిసి కంగుతిన్న పోలీసులు

మద్యం మత్తులో ఆలయంలో చోరీ కోసం వెళ్లిన ఓ దొంగ నిద్ర ఆపుకోలేక అక్కడే కునుకు తీసి పోలీసులకు చిక్కిన ఘటన ఇది. దొంగతనానికి వెళ్లిన తాను స్పృహ వచ్చేసరికి పోలీస్ స్టేషన్లో ఉండడంతో కంగుతిన్నాడు.

వివరాల్లోకి వెళితే... తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా విలాత్తికుళం పత్తినేరి కాలనీకి చెందిన సెంధూర్ పాండ్యన్ (55) భవన నిర్మాణ కార్మికుడు. మద్యానికి, విలాసాలకు బానిసై అదనపు ఆదాయం కోసం చోరీలకు అలవాటుపడ్డాడు. ఇళ్లలో సీసీ కెమెరాలు పెట్టడం పెరిగాక అక్కడ దొంగతనాలు అంత శ్రేయస్కరం కాదని భావించి ఆలయాల్లో చోరీలు మొదలు పెట్టాడు. పగటిపూట ఆలయాల వద్ద రెక్కీ నిర్వహించి రాత్రిపూట చోరీలకు పాల్పడుతుంటాడు.

అలవాటు ప్రకారం విరుద్ నగర్ జిల్లా ఆర్ఆర్ ప్రాంతంలోని పెరుమాళ్ ఆలయంలో చోరీ కోసం వెళ్లాడు. అప్పటికే ఫుల్ గా మద్యం సేవించి ఉండడంతో ఆలయంలోకి ప్రవేశించాక నిద్ర ముంచుకువచ్చింది. దీంతో అక్కడే గుర్రు పెట్టి నిద్రపోయాడు.

ఆ రాత్రి గస్తీ తిరుగుతున్న పోలీసులు ఆలయంలో పడివున్న సెంధూర్ ను గుర్తించారు. తొలుత స్పృహతప్పి పడిపోయాడేమోనని అనుకున్నారు. పక్కనే ఇనుప కమ్మీ, టార్చిలైటు ఉండడంతో అనుమానం వచ్చి స్టేషన్‌కు తీసుకువెళ్లి విచారిస్తే అసలు విషయం బయటపడడంతో నోరెళ్లబెట్టారు.

More Telugu News