Crime News: తూర్పుగోదావరి జిల్లాలో.. లిఫ్ట్ ఇస్తామని చెప్పి దారిదోపిడీకి పాల్పడుతున్న ముఠా అరెస్టు

  • రాత్రిపూట వాహనం కోసం ఎదురుచూసే వారే లక్ష్యం 
  • అటే వెళ్తున్నామని సాయానికి ముందుకు 
  • నమ్మి వాహనం ఎక్కారో అంతే సంగతులు

రాత్రిపూట బస్సు, ఆటోల కోసం వేచి ఉండే వారికి లిఫ్ట్ ఇస్తామని చెప్పి దారిదోపిడీకి పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పోలీసులు అరెస్టు చేశారు. కొన్నాళ్లుగా ఇటువంటి ఘటనలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు అందడంతో పోలీసులు దృష్టి సారించారు. బృందాలుగా విడిపోయి నిఘా పెట్టారు. 

ఈ క్రమంలో సామర్లకోట గోలివారి వీధిలో బంగారం అమ్మేందుకు వచ్చి అనుమానాస్పదంగా తచ్చాడుతున్న నలుగురు వ్యక్తులను గమనించారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని రాజమహేంద్రవరంలోని ఆటోనగర్‌కు చెందిన కోమలగాంధీ, తాళ్లరేవు మండలం జార్జి పేటకోనేరు గ్రామానికి చెందిన దాసరి నాగరాజు, నీలపల్లికి చెందిన గుబ్బల శివశంకర్, శంఖవరం మండలం కత్తిపూడికి చెందిన జెట్టిపోతుల సతీష్ అని గుర్తించారు. వారిని పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా నిజాన్ని అంగీకరించారు.

వాహనం కోసం వేచి ఉన్న వారిని ముందుగానే గమనిస్తారు. ఏ వాహనం రావడం లేదని విసిగిపోతున్న సమయంలో వారి ముందు ప్రత్యక్షమై 'రండి...మేము అటే వెళ్తున్నాం' అంటూ ఎక్కించుకుంటారు. కాస్త దూరం వెళ్లాక నిర్మానుష్య ప్రాంతంలో సదరు వ్యక్తి వద్ద డబ్బు, బంగారం, సెల్ ఫోన్ దోచుకుని అతన్ని అక్కడే వదిలేసి పరారవుతారు.

ఇలా సామర్లకోట, బొమ్మూరు, ఆలమూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో చాలామందిని దోచుకున్నట్లు పోలీసులు తమ విచారణలో గుర్తించారు. వారి వద్ద నుంచి 1.66 లక్షల విలువచేసే మూడు కాసుల బంగారం గొలుసు, వెండి ఉంగరం, రెండు సెల్ ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

రాత్రిపూట అపరిచిత వ్యక్తులు లిఫ్ట్ ఇస్తామన్నా తీసుకోరాదని, మీరు వాహనంపై వెళ్తున్నప్పుడు ఎవరైనా లిఫ్ట్ అడిగినా ఇవ్వవద్దని పోలీసులు సూచించారు.

More Telugu News