SPG amendment bill Rajya Sabha OK: ఎస్పీజీ సవరణ బిల్లుకు రాజ్యసభ ఓకే

  • ఈ సవరణ గాంధీ కుటుంబాన్ని ఉద్దేశించి చేయలేదు
  • ప్రధాని మోదీ కూడా పదవి నుంచి వైదొలగిన ఐదేళ్లకు ఎస్పీజీ భద్రత ఉండదు  
  • గాంధీ కుటుంబంతో పాటే 130 కోట్ల మంది భారతీయుల రక్షణ ముఖ్యమేనన్న అమిత్ షా

రాజ్యసభలో ఎస్పీజీ సవరణ బిల్లుపై వాడీవేడీగా చర్చ సాగింది. ఒకవైపు కాంగ్రెస్ ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేయగా మరోవైపు సభలో బిల్లు మూజువాణి ఓటింగ్ తో ఆమోదం పొందింది. గాంధీ కుటుంబ సభ్యులకు ఎస్పీజీ భద్రతను తొలగించడాన్ని కాంగ్రెస్ ఎంపీలు ప్రశ్నించారు. దీనిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. తాము ఏ కుటుంబాలనూ టార్గెట్ చేయలేదన్నారు. ఆ ఒక్క కుటుంబం భద్రత గురించే మీరు ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. గాంధీ కుటుంబంతో పాటే దేశంలోని 130 కోట్ల మంది భారతీయులను కూడా రక్షించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు.

‘ఎస్పీజీ సవరణ బిల్లును కేవలం గాంధీల కుటుంబం కోసం చేయటంలేదు. వారి కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకొని సవరణ చేసిందికాదు. ఈ చట్టాన్ని సవరించడం ఐదోసారి. ఒక్కటి మాత్రం నిజం, గతంలో ఈ చట్టానికి చేసిన సవరణలు పక్కా వారి కుటుంబాన్ని ఉద్దేశించి చేసినవే. మేము వారికి సీఆర్పీఎఫ్ బలగాలతో జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించాం. వారు భూమి మీదనే అత్యధిక భద్రతను కలిగివున్నారు. సమయం వచ్చినప్పుడు ప్రధాని మోదీ కూడా పదవి నుంచి వైదొలగిన ఐదేళ్లకు ఎస్పీజీ భద్రత ఉండదు. గాంధీ కుటుంబానికే కాక, ఇతర మాజీ ప్రధానులకు కూడా ఎస్పీజీ భద్రత తొలగించిన విషయాన్ని గమనించాలి’ అని అమిత్ షా వివరించారు.

More Telugu News