Odisha: ఒడిశా తీరం వైపు వచ్చే ఆలివ్ రిడ్లే తాబేళ్ల కోసం డీఆర్ డీవో ప్రత్యేక ఏర్పాట్లు

  • ఒడిశా తీరంలో గుడ్లు పెట్టే ఆలివ్ రిడ్లే తాబేళ్లు
  • దీవిలో లైట్లు చూసి దిశ మార్పు
  • తక్కువ కాంతినిచ్చే లైట్లు ఏర్పాటుచేయాలని డీఆర్ డీవో నిర్ణయం

ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందిన తాబేళ్ల జాతిలో ఆలివ్ రిడ్లే ఒకటి. ఆలివ్ రిడ్లే తాబేళ్ల సంతతిని మరింత వృద్ధి చేయడం కోసం అనేక దేశాలు ప్రత్యేకంగా తమ తీరప్రాంతాల్లో ఏర్పాట్లు చేస్తుంటాయి. మనదేశంలోనూ ఒడిశా తీరం వద్ద ఈ తాబేళ్ల కోసం అనేక సంవత్సరాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి ఏడాది ఒడిశా తీరంలోని రుషికుల్య నదీ ముఖద్వారం సమీపానికి వచ్చి ఇవి గుడ్లు పెడుతుంటాయి. సరిగ్గా చెప్పాలంటే ఆలివ్ రిడ్లేలకు ఇది పుట్టిల్లు!

అయితే, ఒడిశా తీరంలో ఉన్న అబ్దుల్ కలాం దీవిలో ఉన్న క్షిపణి పరీక్ష కేంద్రం ఇప్పుడు ఆలివ్ రిడ్లేలకు సమస్యాత్మకంగా మారింది. ఇది సున్నితమైన ప్రాంతం కావడంతో నిత్యం కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. రాత్రివేళల్లో అత్యంత శక్తిమంతమైన లైట్లతో పహరా కాస్తుంటారు. ఇప్పుడీ లైట్ల కారణంగా ఆలివ్ రిడ్లే తాబేళ్లు తమ దిశను మార్చుకుంటున్నట్టు గుర్తించారు. ఆడ తాబేళ్లు అతి భారీ సంఖ్యలో అబ్దుల్ కలాం దీవి దిశగా వస్తుండడంతో వాటికి ఆపద వాటిల్లకుండా నివారణ చర్యలు చేపట్టాలని డీఆర్ డీవో నిర్ణయించింది.

రాత్రివేళల్లో అబ్దుల్ కలాం ఐలాండ్ ను తక్కువ కాంతితో ఉంచుతామని రేంజ్ ఆఫీసర్ దేబాశీష్ భోయీ తెలిపారు. అంతేకాదు, ఇక్కడికి సమీపంలోని పారదీప్ పోర్టులోనూ అత్యంత కాంతినిచ్చే మెర్క్యురీ దీపాల స్థానంలో సోడియం నియాన్ లైట్లను ఏర్పాటు చేస్తున్నారు.

More Telugu News