Andhra Pradesh: మద్యానికి దూరమవుతున్నారు... ఆంధ్రప్రదేశ్ లో పడిపోయిన విక్రయాలు!

  • బీర్ల అమ్మకాల్లో 54 శాతం తగ్గుదల
  • 22 శాతం పడిపోయిన వైన్స్ అమ్మకాలు
  • దశలవారీగా మద్య నియంత్రణ లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు

ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు మద్యానికి దూరమవుతున్నారా? గణాంకాలు చూస్తుంటే మాత్రం అవుననే అంటున్నాయి. దశలవారీ మద్య నియంత్రణలో భాగంగా వైన్స్ షాపుల సమయాన్ని తగ్గించడం, రేట్లను పెంచడంతో అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. గత సంవత్సరం నవంబర్ తో పోలిస్తే, ఈ సంవత్సరం అమ్మకాల్లో 22.31 శాతం ఆదాయం పడిపోయింది. ఇక బీర్ల అమ్మకాలైతే సగానికి సగం తగ్గడం గమనార్హం. బీర్ల అమ్మకాలు 54.30 శాతం తగ్గాయి.

2018 నవంబర్ లో 29.62 లక్షల కేసుల మద్యం విక్రయాలు సాగగా, ఈ సంవత్సరం 22.31 లక్షల కేసులు అమ్ముడయ్యాయి. బీర్ల విషయానికి వస్తే గత సంవత్సరం 17.80 లక్షల కేసుల అమ్మకాలు జరుగగా, ఈ సంవత్సరం 8.13 లక్షల కేసులు మాత్రమే అమ్ముడయ్యాయి.

ఏపీలో గత సంవత్సరం 4,380 వైన్ షాపులుండగా, కొత్త విధానంలో షాపుల సంఖ్యను 3,500కు తగ్గించిన సంగతి తెలిసిందే. ఆపై విక్రయ వేళలను కూడా రెండు గంటల పాటు తగ్గించారు. దుకాణాలన్నీ ఎక్సైజ్ అధికారుల నేతృత్వంలో నడుస్తూ ఉండటంతో సమయపాలన పాటిస్తున్నారు. దీంతోనే విక్రయాల నియంత్రణ సాద్యమైందని అధికారులు అంటున్నారు. ప్రభుత్వ నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తున్నాయని చెబుతున్నారు.

More Telugu News