Disha: ఇలాంటి వారికి సింగపూర్ తరహా శిక్షలు విధించాలి: పవన్ కల్యాణ్

  • రాయలసీమలో పర్యటిస్తున్న పవన్
  • తిరుపతిలో కార్యకర్తలతో సమావేశం
  • దిశ ఘటనపై ఆగ్రహం

రాయలసీమ పర్యటనలో ఉన్న జనసేనాని పవన్ కల్యాణ్ తిరుపతిలో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆవేశపూరితంగా ప్రసంగించారు. శంషాబాద్ దిశ ఘటన గురించి మాట్లాడుతూ, ఆడపిల్లలు ఇంట్లోంచి బయటికి వెళ్లి తిరిగి వచ్చేంతవరకు ఓ అన్నగా, ఓ తమ్ముడిగా గుండెలు ఎలా కొట్టుకుంటాయో తనకు తెలుసని, తాను ఆడపిల్లల మధ్య పెరిగినవాడ్నేనని అన్నారు.

తాను షూటింగ్ లకు వెళ్లినప్పుడు పొట్టకూటి కోసం రూ.1000, రూ.2000 వేల కోసం జూనియర్ ఆర్టిస్టులు తమతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా వచ్చేవారని, కానీ వాళ్లను చూసి జనాలు ఇష్టంవచ్చినట్టు ప్రవర్తిస్తుంటే తట్టుకోలేక కర్ర పట్టుకుని వారికి కాపలా నిల్చునేవాడ్నని, కొన్ని సందర్భాల్లో తన కారు ఇచ్చి వారిని సురక్షిత ప్రాంతాలకు పంపిన సందర్భాలు కూడా ఉన్నాయని వివరించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని ప్రస్తావించారు.

"మన ఇంట్లో ఉన్న మహిళల మానప్రాణాలను సంరక్షించుకోలేకపోతే 151 సీట్లు వచ్చి ప్రయోజనం ఏంటి? టీవీల ముందు కూర్చుని బూతులు తిట్టడానికా మీరు ఉన్నది? మా నాయకులే ఇలా ఉన్నారని, అక్కడ జనాలు రోడ్లపైన బలాత్కారాలు చేస్తున్నారు! మీరు చిత్తశుద్ధితో, గట్టిగా మాట్లాడితే, మా నాయకులు ఇంత కచ్చితంగా ఉన్నారని అక్కడ జనాలు కూడా మానభంగాలు చేయలేరు.

కానీ, వీళ్లు ఇంత బాధ్యత లేకుండా మాట్లాడడం వల్ల రాజకీయాలు ఇంత కుళ్లిపోయి ఉంటాయి కాబట్టి తాము ఏదైనా చేయొచ్చన్న ధైర్యం రోడ్లపై తిరిగే కొంతమందికి ఉంటుంది. ఇలాంటి వారికి సింగపూర్ తరహా శిక్షలు విధించాలి. దేవతలు సైతం అభయహస్తంతో పాటు కత్తులు కటార్లు ఎందుకు పట్టుకుంటారంటే, తప్పులు చేస్తే అడ్డంగా దండిస్తామన్న హెచ్చరిక అది" అంటూ పవన్ తన అభిప్రాయాలు వెల్లడించారు.

More Telugu News