Kurnool District: మేము అధికారంలో ఉన్నప్పుడు కేసులు పెట్టి వుంటే వైసీపీ వుండేదా?: చంద్రబాబునాయుడు

  • టీడీపీ నాయకులు, కార్యకర్తలపై  ఎన్నో దాడులు చేశారు
  • 690 కేసులు బనాయించారు
  • కర్నూలులో టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో బాబు
తాము అధికారంలో ఉన్నప్పుడు కేసులు పెట్టి వుంటే వైసీపీ వుండేదా? అని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. కర్నూలులో టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, టీడీపీ నాయకులు, కార్యకర్తలపై  ఎన్నో దాడులు చేశారని, 690 కేసులు బనాయించారంటూ వైసీపీపై మండిపడ్డారు. ‘కూర్చుంటే కేసు, నిలబడితే కేసు’ పెడుతున్నారని ఎద్దేవా చేశారు. వేధింపు చర్యలు పెరిగిపోయాయని, ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ యాక్టు పెడుతున్నారని విమర్శించారు.

సీఎం జగన్ పాలనపైన కూడా చంద్రబాబు విమర్శలు చేశారు. ఇన్నేళ్లలో ఒక విచిత్రమైన నాయకుడిని చూస్తున్నామని అన్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో ఏం పురోగతి సాధించారు? అని ప్రశ్నించారు. ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ కార్మికులు రోడ్డునపడ్డారని మండిపడ్డారు. ఇసుక ఇప్పుడైనా దొరుకుతోందా? అని ప్రశ్నించారు. ట్రాక్టర్ ఇసుక ధర రూ.4 వేలు, లారీ ఇసుక రూ.10 వేలు ఉందని విమర్శించారు. కర్నూలు ఇసుకను బెంగళూరు, హైదరాబాద్ కు తరలిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు మాఫియాలా మారారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Kurnool District
Telugudesam
Chandrababu
jagan

More Telugu News