mumbai: బీజేపీ ప్రభుత్వాన్ని చూసి ప్రజలు ఎందుకు భయపడుతున్నారు? : అమిత్ షాకు రాహుల్ బజాజ్ సూటి ప్రశ్న

  • విమర్శించాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించాలా? 
  • ఓ వాణిజ్య పత్రిక కార్యక్రమంలో కేంద్రమంత్రికి షాక్ 
  • అదేం లేదు....మమ్మల్ని కూడా విమర్శిస్తున్నారని షా వివరణ

దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి, బీజేపీ మాస్టర్ మైండ్ అమిత్ షాకు షాకింగ్ ప్రశ్న ఎదురైంది. అది కూడా ఓ బిజినెస్ టైకూన్ నుంచి ఈ ప్రశ్న ఎదురు కావడంతో ఆయన కాసేపు గుక్కతిప్పుకోలేకపోయారు. 'కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించాలంటే ప్రజలు భయపడుతున్నారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది' అంటూ ప్రముఖ పారిశ్రామికవేత్త రాహుల్ బజాజ్ అనూహ్యమైన ప్రశ్న సంధించారు. దీంతో కాసేపు మౌనం వహించిన షా అనంతరం మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వాన్ని చూసి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని వివరణ ఇచ్చారు. నిజంగా అటువంటి పరిస్థితే ఉంటే దాన్ని తొలగించాల్సిన బాధ్యత మాపై ఉందని  చెప్పుకొచ్చారు.

నరేంద్ర మోదీని కూడా విమర్శిస్తూ పలు పత్రికలు కథనాలు ఇస్తున్నాయని గుర్తు చేశారు. మోదీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా పనిచేస్తోందని, సద్విమర్శలు ఎలాంటివైనా స్వాగతిస్తామని తెలిపారు. జమ్మూకశ్మీర్ లో పూర్తి శాంతియుత వాతావరణం నెలకొందని, కుటుంబాలతో కలిసి ఆ రాష్ట్రంలో పర్యటించాలని షా సూచించారు.

కశ్మీర్ లో ఇంటర్నెట్ పై ఆంక్షల అంశాన్ని కొందరు ప్రస్తావించగా అక్కడి ప్రభుత్వం తగిన సమయంలో అవసరమైన నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. మహాత్మాగాంధీని చంపిన నాథూరాం గాడ్సేను దేశభక్తుడిగా పేర్కొన్న బీజేపీ ఎంపీ ప్రజ్ఞాసింగ్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అమిత్ షా మరో ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ఇప్పటికే రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ దీనిపై వివరణ ఇచ్చారని గుర్తు చేశారు.

More Telugu News