Disha: ఘటన తర్వాత సీసీ కెమెరాలు చూడడం కాదు...!: శంషాబాద్ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం

  • శంషాబాద్ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ స్పందన
  • పోలీసుల తీరుపై అసంతృప్తి
  • ఘటనలో పోలీసుల నిర్లక్ష్యం కూడా ఉందన్న కమిషన్

వెటర్నరీ వైద్యురాలు అత్యంత దారుణమైన పరిస్థితుల్లో కడతేరిపోవడంపైన, అందుకు దారి తీసిన పరిస్థితులపైనా జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఇలాంటి సంఘటనల్లో పోలీసులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని స్పష్టం చేసింది. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని పేర్కొంది. ఆమె ఫోన్ ఇప్పటికీ లభ్యం కాలేదని, పోలీసులు సరిగా స్పందించలేదని కుటుంబ సభ్యులు అంటున్నారని, దీనికేం జవాబు చెబుతారని జాతీయ మహిళా కమిషన్ సభ్యులు ప్రశ్నించారు.

రహదారులపై లారీలు ఎక్కడంటే అక్కడ పార్క్ చేస్తున్నా ఎందుకు పట్టించుకోవడంలేదని నిలదీశారు. ఈ ఘటనలో పోలీసుల నిర్లక్ష్యం కూడా ఉందని జాతీయ మహిళా కమిషన్ అభిప్రాయపడింది. ఘటన తర్వాత సీసీ కెమెరాలు చూడడంతో సరిపెట్టకుండా, రోజు మొత్తం మానిటరింగ్ చేసే వ్యవస్థ ఉండాలని స్పష్టం చేసింది. ఈ ఘటనలో నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించిన పోలీసులను డిస్మిస్ చేయాలని కమిషన్ సభ్యులు పేర్కొన్నారు.

More Telugu News