Kannababu: మేధావులు సైతం ఆశ్చర్యపోయేలా ఏపీలో జనరంజక పాలన కొనసాగుతోంది: మంత్రి కన్నబాబు

  • తాడేపల్లిలో మీడియా సమావేశం
  • సీఎం జగన్ పై కన్నబాబు ప్రశంసల వర్షం
  • జగన్ పేరు జాతీయస్థాయిలో వినిపిస్తోందన్న మంత్రి

ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీలో సీఎం జగన్ నేతృత్వంలో జనరంజక పాలన కొనసాగుతోందని అన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని, వ్యవస్థలను విచ్ఛిన్నం చేసి నిష్క్రమించిన నేపథ్యంలో, జగన్ ఎలా నెట్టుకొస్తాడోనని సందేహాలు వచ్చాయని, కానీ మేధావులు సైతం ఆశ్చర్యపోయేలా రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు జరుగుతోందని తెలిపారు. వైసీపీ పాలన పట్ల ప్రతి ఒక్కరూ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, ఊహించిన దానికంటే వేగంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారని అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.

దేశంలో బాగా పనిచేసే ముఖ్యమంత్రులు ఎవరంటే ఇవాళ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు జాతీయస్థాయిలో వినిపిస్తోందని తెలిపారు. దశాబ్దాల తరబడి అపరిష్కృతంగా ఉన్న సమస్యలకు జగన్ కొద్ది సమయంలోనే నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. అనేక సమస్యలను జగన్ ఓ సవ్యసాచిలా ఎదుర్కొంటున్న తీరు కొందరికి కడుపుమంట రగుల్చుతోందని విపక్షనేతలపై కన్నబాబు మండిపడ్డారు. ముఖ్యంగా జగన్ ను చూసి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్, వారి వందిమాగధుల బాధ వర్ణనాతీతంగా ఉందని అన్నారు.

జగన్ కు ఇంత పేరు రాకుండా ఎలా అడ్డుకోవాలంటూ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు అబద్ధాల ఫ్యాక్టరీలో రోజుకో అబద్ధాన్ని సృష్టించి ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ఈ విధంగా చేయడం వెనుక పార్టీని బలోపేతం చేసుకోవాలన్న ఉద్దేశం కనిపిస్తోందని, కానీ జగన్ పై అవాకులుచెవాకులు ప్రచారం చేయడం ద్వారా పార్టీ ఏ విధంగా బలపడుతుందని ప్రశ్నించారు. గత పదేళ్లుగా జగన్ పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని చూస్తే దేశంలో ఏ నేతపైనా జరిగుండదని అన్నారు.

ఇవాళ టీడీపీ వెలువరించిన ఓ పుస్తకంలో జగన్ ను మంచి ముఖ్యమంత్రిగా కాకుండా ముంచే సీఎం అని పేర్కొన్నారని, అసలు ఈ దేశంలో ముంచడంలో మీకు తప్ప మరెవరికి పేటెంట్ ఉందని చంద్రబాబుపై కన్నబాబు ధ్వజమెత్తారు. మామగారితో మొదలుకొని రాజధాని రైతుల వరకు ఎవర్ని ముంచకుండా వదిలారో చెప్పాలని నిలదీశారు. జీవితకాలమంతా ఎవరో ఒకరిని ముంచి పైకొచ్చినవాడివి అంటూ నిప్పులు చెరిగారు.

  • Loading...

More Telugu News