Amit Shah: వారి మాదిరి మేము కుల రాజకీయాలు చేయం: అమిత్ షా

  • మా దృష్టిలో పేదలు అనే ఒకే కులం మాత్రమే ఉంది
  • జార్ఖండ్ ను కాంగ్రెస్ ఇవ్వలేదు
  • ఓబీసీలకు రిజర్వేషన్లను పెంచుతాం

కాంగ్రెస్, జేఎంఎం పార్టీల మాదిరి బీజేపీ కుల రాజకీయాలకు పాల్పడదని... తమ దృష్టిలో పేదలు అనే ఒకే కులం ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. జార్ఖండ్ లోని ఛాత్రాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జార్ఖండ్ ఎన్నికల్లో కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీలు కూటమిగా పోటీ చేస్తున్నాయి. ఈ అంశంపై అమిత్ షా మాట్లాడుతూ, జార్ఖండ్ యువత ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అణగదొక్కాలని చూసిందో హేమంత్ సోరెన్ చెప్పాలని డిమాండ్ చేశారు.

జార్ఖండ్ ను కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదని అమిత్ షా గుర్తుచేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఎందరో జార్ఖండ్ యువత తమ ప్రాణాలను త్యాగం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పటి ప్రధాని వాజ్ పేయి జార్ఖండ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని చెప్పారు. జార్ఖండ్ లో పూర్తి మెజార్టీతో బీజేపీలోకి అధికారంలోకి వచ్చిన వెంటనే... ఓబీసీలకు వీలైనంత ఎక్కువ రిజర్వేషన్లను కల్పించేందుకు గాను ఓ కమిటీని వేస్తామని చెప్పారు. తమ మేనిఫెస్టోలో కూడా దీన్ని పెట్టామని అన్నారు.

More Telugu News