సంతాన ప్రాప్తి కోసం ఆలయానికి వస్తే.. ఒంటరిగా మాట్లాడాలని చెప్పి, అర్చకుడి అత్యాచారయత్నం!

27-11-2019 Wed 07:56
  • అమరావతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన జంట
  • సంతానం కలగాలంటే ఒంటరిగా మాట్లాడాలన్న పూజారి
  • దైవసన్నిధిలోకి తీసుకెళ్లి అసభ్య ప్రవర్తన

సంతానప్రాప్తి కోసం ఆలయానికి వచ్చిన ఓ వివాహితపై అర్చకుడు అత్యాచారయత్నం చేశాడు. గుంటూరు జిల్లా అమరావతిలో జరిగిందీ ఘటన. విజయవాడకు చెందిన దంపతులు నిన్న ఉదయం గ్రామంలోని ఆలయాన్ని సందర్శించుకున్నారు. సంతాన ప్రాప్తి కోసం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకుడి ఆశీస్సులు కోరి అతడి పాదాలకు నమస్కరించారు.

అయితే, సంతానం కలగాలంటే మహిళతో ఒంటరిగా మాట్లాడాలని చెప్పి మహిళను నమ్మించిన అర్చకుడు ఆమెను దైవసన్నిధిలోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె గట్టిగా అరుస్తూ అతడి నుంచి తప్పించుకుని పరుగులు తీసింది. దీంతో భయపడిన అర్చకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాధిత మహిళ కుటుంబ సభ్యులు గ్రామస్థులకు ఈ విషయం చెప్పి వెళ్లిపోయారు. విషయం దేవాదాయ శాఖ అధికారుల దృష్టికి చేరడంతో వారు రహస్యంగా విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది.