Ganguly: గంగూలీకి దిశానిర్దేశం చేసిన అంపైరింగ్ దిగ్గజం!

  • భారత్ కు అంతర్జాతీయ అంపైర్ల కొరత
  • ప్రత్యేకంగా ప్రస్తావించిన సైమన్ టౌఫెల్
  • అంపైర్ల శిక్షణకు ఓ వ్యవస్థ ఉండాలన్న టౌఫెల్

ఇటీవలే బీసీసీఐ అధ్యక్షుడిగా పాలనా పగ్గాలు అందుకున్న సౌరవ్ గంగూలీ కేవలం క్రికెటర్లను మాత్రమే కాకుండా భారత్ నుంచి అంతర్జాతీయ అంపైర్లను తయారుచేయడంపైనా దృష్టి సారించాలని అంపైరింగ్ దిగ్గజం సైమన్ టౌఫెల్ పిలుపునిచ్చారు. తన సునిశితమైన అంపైరింగ్ తోనే కాకుండా, హుందాతనంతోనూ క్రికెట్ మైదానంలోనూ, బయటా విశేషంగా అభిమానులను సంపాదించుకున్న టౌఫెల్ కొంతకాలం కిందటే అంపైరింగ్ నుంచి తప్పుకున్నారు.

తాజాగా, భారత్ నుంచి ఒక్క అంపైర్ కూడా అంతర్జాతీయ స్థాయిలో విధులు నిర్వర్తిస్తుండకపోవడాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. అతికష్టం మీద ఐసీసీ ఎలైట్ ప్యానల్ అంపైర్ల జాబితాలో చోటు సంపాదించిన భారత అంపైర్ ఎస్.రవిని ఈ ఏడాది ఆరంభంలో తొలగించారు. దాంతో ఎలైట్ ప్యానల్లో భారత్ కు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. దీనిపై టౌఫెల్ మాట్లాడుతూ, ఎస్.రవి అంతర్జాతీయ స్థాయిలో అంపైరింగ్ చేయడానికి పదేళ్లు పట్టిందని తెలిపారు.

ప్రస్తుతం భారత్ లో ఉన్న పరిస్థితులు, అంపైర్లను చూస్తుంటే మరికొన్నేళ్ల పాటు ప్రపంచస్థాయిలో ఓ భారతీయుడు అంపైరింగ్ చేయడం కష్టమేననిపిస్తోందని అభిప్రాయపడ్డారు. గంగూలీ దేశవాళీ క్రికెటర్లను మాత్రమే కాకుండా, దేశవాళీ అంపైర్ల పైనా శ్రద్ధ చూపించి వారు అంతర్జాతీయస్థాయికి ఎదిగేందుకు అవకాశాలు కల్పించాలని సూచించారు. అంపైరింగ్ నేర్పించే కోచ్ లు, అంపైరింగ్ మేనేజర్లు వంటి వ్యవస్థకు రూపకల్పన చేయాలని సలహా ఇచ్చారు. 

More Telugu News