Maharashtra: రేపే బల పరీక్ష నిర్వహించండి: మహారాష్ట్రపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

  • సాయంత్రం గం. 5 లోగా బల పరీక్ష
  • సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆలస్యం ఏంటి
  • అసెంబ్లీ సమావేశాలను లైవ్ లో చూపాలని సుప్రీం ఆదేశాలు

మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ, అజిత్ పవార్ కూటమి రేపే బలాన్ని నిరూపించుకోవాలని సుప్రీంకోర్టు కొద్దిసేపటి క్రితం సంచలన తీర్పును వెలువరించింది. ఈ కూటమికి బలం ఉంటే, వెంటనే అసెంబ్లీని సమావేశపరచాలని, బల పరీక్షకు సిద్ధం కావాలని ఆదేశించింది. తమకు బలం ఉందని చెబుతూ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత కూడా ఆలస్యం చేయడం ఏంటని ఈ సందర్భంగా న్యాయమూర్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బల పరీక్ష అసెంబ్లీ వేదికగా జరగాలే తప్ప, రాజ్ భవన్ లో కాదని అన్నారు. బుధవారం సాయంత్రం 5 గంటల్లోగా విశ్వాస పరీక్ష జరగాలని ఆదేశించారు.

బల పరీక్షను సజావుగా నిర్వహించేందుకు ప్రొటెమ్ స్పీకర్ ను తక్షణమే నియమించాలని, మొత్తం అసెంబ్లీ సమావేశాలను చిత్రీకరిస్తూ, లైవ్ టెలికాస్ట్ చేయాలని కూడా ఆదేశించించింది. రేపు ఉదయం నుంచి సాయంత్రంలోగా ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం పూర్తి కావాలని, ఆ వెంటనే బల పరీక్ష జరపాలని ఆదేశాలు జారీ చేసింది. బల పరీక్షలో రహస్య ఓటింగ్ ను జరపరాదని కూడా సూచించింది.

More Telugu News