Harbhajan: మరీ ఇంత అన్యాయమా... ధైర్యంలేని ఇలాంటి సెలెక్టర్లను తీసేయండి: గంగూలీకి హర్భజన్ సూచన

  • బంగ్లాదేశ్ టీ20 సిరీస్ కు ఎంపికైన శాంసన్
  • ఒక్క అవకాశం కూడా ఇవ్వని టీమ్ మేనేజ్ మెంట్
  • విండీస్ తో సిరీస్ లకు శాంసన్ కు మొండిచేయి చూపిన సెలెక్టర్లు

ఇటీవల బంగ్లాదేశ్ తో టీ20 సిరీస్ కోసం యువ వికెట్ కీపర్ సంజూ శాంసన్ ను టీమిండియాకు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. కానీ శాంసన్ కు ఆ సిరీస్ లో ఒక్క అవకాశం కూడా దక్కలేదు సరికదా, వెస్టిండీస్ తో వన్డే, టి20 సిరీస్ ల కోసం ఎంపిక చేసిన జట్టులో స్థానం కూడా కోల్పోయాడు. ఈ పరిణామంపై మాజీ క్రికెటర్లు ప్రశ్నిస్తున్నారు. కనీసం ఒక్క మ్యాచ్ లో అయినా అవకాశం ఇవ్వకుండా ఏ ప్రాతిపదికన శాంసన్ ను జట్టు నుంచి తొలగిస్తారని మండిపడుతున్నారు. స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ ఈ విషయంలో ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

శాంసన్ కు తుదిజట్టులో అవకాశం ఇవ్వకుండా అతడ్ని ఎలా అంచనా వేస్తారని ప్రశ్నించాడు. ధైర్యంలేని ఇలాంటి సెలెక్టర్లను వెంటనే తొలగించాలని భజ్జీ బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీకి సూచించాడు. నిర్భయంగా నిర్ణయాలు తీసుకోగల సెలెక్టర్లు అవసరమని అభిప్రాయపడ్డాడు. అటు, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.

మూడు టి20 మ్యాచ్ లకు శాంసన్ ను మంచినీళ్లు అందించే బాయ్ లా వాడుకుని, ఇప్పుడు జట్టు నుంచి తొలగిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకీ అతడ్ని జట్టులోకి తీసుకున్నది అతడి బ్యాటింగ్ ను పరీక్షించడానికా? లేక అతడి సహనాన్ని పరీక్షించడానికా? అంటూ నిలదీశారు.

గతకొంతకాలంగా రెగ్యులర్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ వరుసగా విఫలమవుతున్నా అతడ్నే తుదిజట్టులో కొనసాగిస్తుండడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ధోనీ వారసుడిగా పేర్కొంటున్న పంత్ స్థాయికి తగ్గ ఆటతీరు కనబర్చకపోగా, నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకుంటుండడం పట్ల మాజీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News