Virat Kohli: గంగూలీని పొగిడిన కోహ్లీపై గవాస్కర్ కామెంట్

  • 1970లలోనే విదేశాల్లో భారత్ గెలుపొందింది
  • అప్పటికి కోహ్లీ ఇంకా పుట్టనేలేదు
  • 2000లోనే క్రికెట్ ప్రారంభమైందని చాలా మంది అనుకుంటున్నారు

 కోల్ కతాలో బంగ్లాదేశ్ తో జరిగిన రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. పింక్ బాల్ తో ఆడిన తొలి టెస్టులోనే ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో బంగ్లాను చిత్తు చేసింది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ కోహ్లీ మాట్లాడుతూ, 'ఇదొక అద్భుత విజయం. ఇదే సందర్భంగా ఓ విషయాన్ని చెప్పాలనుకుంటున్నా. భారత్ అద్భుత విజయాలను సాధించడం 2000లో గంగూలీ నాయకత్వంలో ప్రారంభమైంది. మాపై గంగూలీ ప్రభావం చాలా ఉంది' అని చెప్పాడు.

కోహ్లీ వ్యాఖ్యలపై భారత క్రికెట్ దిగ్గజం గవాస్కర్ సునిశిత విమర్శలు గుప్పించారు. గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడు కావడం వల్లే కోహ్లీ ఇలా వ్యాఖ్యానించి ఉండవచ్చని అన్నారు. 1970, 1980లలో కూడా భారత్ విజయాలను సాధించిందని చెప్పారు. అప్పటికి కోహ్లీ ఇంకా పుట్టనేలేదని అన్నారు.

2000లోనే క్రికెట్ ప్రారంభమైందని ఇంకా చాలా మంది అనుకుంటున్నారని, కానీ, అంతకన్నా 30 ఏళ్ల క్రితమే (1970లలో) భారత్ విదేశీ గడ్డపై విజయాలను నమోదు చేసిందని చెప్పారు. 1986లో కూడా విదేశాల్లో భారత్ గెలిచిందని, సిరీస్ లను డ్రా చేయగలిగిందని చెప్పారు. ఇతర జట్ల మాదిరే ఓటమిపాలు కూడా అయిందని గవాస్కర్ అన్నారు.

More Telugu News