Maharashtra: అర్ధరాత్రి ఫడ్నవీస్ తో అజిత్ పవార్ భేటీ .. మొదలైన ఊహాగానాలు!

  • రైతు సమస్యలపై చర్చించారన్న సీఎం కార్యాలయం
  • పదవుల పంపకం కోసమేనంటున్న రాజకీయ విశ్లేషకులు
  • అది ముందే జరిగిపోయిందన్న బీజేపీ నేత

మహారాష్ట్ర రాజకీయం ఎవరికీ అంతుబట్టడం లేదు. ఎప్పుడేం జరుగుతుందో తెలియక అటు రాజకీయ పార్టీలు, ఇటు ప్రజలు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. కోడికూయకముందే ఏర్పాటైన ఫడ్నవీస్ ప్రభుత్వం ఉంటుందో, ఊడుతుందో తెలియక అయోమయం చెందుతున్నారు. ఎమ్మెల్యేలు జారిపోకుండా అటు బీజేపీ జాగ్రత్త పడుతుండగా, తమ ఎమ్మెల్యేలు ఎక్కడ హ్యాండిస్తారోనన్న భయంతో ఎన్సీపీ, కాంగ్రెస్‌లు నిత్యం అప్రమత్తంగా ఉంటున్నాయి.

ఈ నేపథ్యంలో.. గత అర్ధరాత్రి ముఖ్యమంత్రి ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌లు భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. వారిద్దరూ ఏం చర్చించి ఉంటారన్న విషయంపై ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే, సీఎం కార్యాలయం మాత్రం వారు రైతు సమస్యలపై చర్చించారని తెలిపింది. రాజకీయ విశ్లేషకుల వాదన మాత్రం మరోలా ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన లేఖల్ని నేడు కోర్టుకు సమర్పించాలన్న ఆదేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపైనే చర్చించినట్టు చెబుతున్నారు. తనతో పాటు వచ్చిన ఎమ్మెల్యేలకు శాఖల కేటాయింపు విషయమై అజిత్ పవార్ సీఎంను కలిసినట్టు మరో వాదన కూడా వినిపిస్తోంది.

అయితే, అలాంటిదేమీ లేదని, ప్రమాణ స్వీకారానికి ముందే ఈ విషయంలో ఓ ఒప్పందం జరిగిపోయిందని, బల నిరూపణ సమయంలో అనుసరించాల్సిన వ్యూహాలపైనే ప్రధానంగా చర్చ జరిగినట్టు బీజేపీ నేత ఒకరు తెలిపారు. ఆదివారం రాత్రి వరకు ఇంటి పట్టునే ఉండి వ్యూహ రచన చేసిన అజిత్ పవార్ అర్ధరాత్రి వేళ ఫడ్నవీస్‌ను కలవడంపై ఇంకేదో ఉండే ఉంటుందని అంటున్నారు.

  • Loading...

More Telugu News