Jagan: 'ఫ్రైడే' సీఎంగా ఎవర్నైనా నియమించండి.. దమ్ముంటే మీపై ఉన్న కేసులపై విచారణకు హాజరుకాండి: జగన్ కు వర్ల రామయ్య సవాల్

  • ప్రతి శుక్రవారం ఆయన కోర్టుకు వెళ్లాలి
  • వాయిదాలు వేయించుకోవద్దు 
  • అవసరమైతే వారానికి రెండుసార్లు వెళ్లండి
  • వేగంగా విచారణ జరగాలి  

అక్రమాస్తుల కేసులో ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే ఏపీ ముఖ్యమంత్రి జగన్... ప్రతి శుక్రవారం ప్రభుత్వ పాలనా వ్యవహారాల కోసం ప్రత్యేకంగా మరొక నేతను 'ఫ్రైడే' చీఫ్ మినిస్టర్ గా నియమించాలని టీడీపీ నేత వర్ల రామయ్య ఎద్దేవా చేశారు.

 ఈ రోజు గుంటూరులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... 'ప్రతి శుక్రవారం జగన్ కోర్టుకు వెళ్లాల్సి ఉంది. అక్రమాస్తుల కేసులో ప్రతి శుక్రవారం వాయిదా వేయకుండా తప్పకుండా వెళ్లండి. ఇంకా అవసరమైతే వారానికి రెండుసార్లు వెళ్లండి. కడిగిన ముత్యంలా, బయటకు వస్తానని, తనపై వచ్చినవన్నీ ఆరోపణలు మాత్రమేనని దమ్ముంటే జగన్ నిరూపించుకోవాలి. తాను విచారణకు వెళ్తే ప్రభుత్వ పాలన కొనసాగదని వంకలు చెప్పొద్దు. కావాలంటే శుక్రవారం తనకు బదులుగా ఆయన మరొక నేతను తన ప్రతినిధిగా, ఫ్రైడే సీఎంగా నియమించాలి. పాలనా వ్యవహారాలు ఫ్రైడే సీఎం చూసుకుంటారు' అంటూ సలహా ఇచ్చారు.

'మరీ ఇన్నేళ్లపాటు విచారణ కొనసాగితే ఎలా? న్యాయస్థానానికి జగన్ సహకరించాలి. ఏదో వంకతో, అధికారం, అంగబలం ఉందన్న గర్వంతో, విచారణను వాయిదా వేయొద్దు. ఇప్పటికైనా కోర్టులో విచారణ వేగంగా జరగాలి. తనపై ఉన్న మచ్చను జగన్ తుడిపేసుకోవాలి. ఒక ముఖ్యమంత్రిపై ఇన్ని కేసులుండడం సరికాదు. ఆయన నిర్దోషిగా బయటకు రావాలని నేనూ కోరుకుంటున్నాను. ఇందుకోసం త్వరితగతిన విచారణ జరగాలి' అని వర్ల రామయ్య వ్యాఖ్యానించారు.

'ఉదయం నుంచి సాయంత్రం వరకు కోర్టులోనే ఉంటానని, విచారణ వేగవంతం చేయాలని జగన్ కోరాలి. అంతేగానీ, వంకలు చెబుతూ కోర్టు విచారణను తప్పించుకోవడం సరికాదు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌‌... జగతి పబ్లికేషన్ కు చెందిన ఓ పత్రికలో 834 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు. పత్రికా రంగంలో ప్రపంచంలోనే ఒక పారిశ్రామిక వేత్త ఇంత భారీ పెట్టుబడులు పెట్టిన దాఖలాలు లేవు' అని వర్ల రామయ్య పేర్కొన్నారు.

'నేను చెప్పింది అసత్యమని నిరూపిస్తే మీకు చేతులెత్తి నమస్కారం చేస్తాను. పత్రికా రంగంతో సంబంధం లేని వ్యక్తి భారీ పెట్టుబడులు ఎందుకు పెట్టారు? ఆ పత్రిక ఆయనది కాదు.. ఆయన కుటుంబ సభ్యులది కాదు.. పత్రికా రంగం లాభసాటి వ్యాపారం కూడా కాదు.. మరి ఆయన ఇందులో ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టారు?' అని వర్ల రామయ్య ప్రశ్నించారు.

More Telugu News