Telangana: ఆర్టీసీ బలోపేతానికి తెలంగాణ ప్రభుత్వం యోచన.. తెరపైకి స్వచ్ఛంద పదవీ విరమణ పథకం!

  • ప్రైవేటీకరణకు హైకోర్టు పచ్చజెండా
  • 5100 రూట్లలో ప్రైవేటును అనుమతించనున్న ప్రభుత్వం
  • అదే జరిగితే 50 శాతం మంది ఉద్యోగులకు పనులు కరవు

నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఆర్టీసీని ప్రైవేటీకరించడంతోపాటు స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) పథకాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ప్రైవేటు ఆపరేటర్లకు రూట్లు కేటాయిస్తే ప్రస్తుతం ఉన్న సిబ్బందిలో దాదాపు 50 శాతం మందికి పనులు ఉండే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో వారిని స్వచ్ఛందంగా సంస్థ నుంచి బయటకు పంపేందుకు వీఆర్ఎస్‌ను అమలు చేయాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్టు తెలుస్తోంది. ఒకవేళ ఈ పథకాన్ని కనుక అమల్లోకి తెస్తే అందుకు అవసరమైన నిధులను సమకూర్చుకోవడంపైనా ప్రభుత్వం దృష్టి సారించినట్టు సమాచారం.

తెలంగాణ ఆర్టీసీలో ప్రైవేటుకు హైకోర్టు కూడా పచ్చజెండా ఊపడంతో 5,100 రూట్లలో ప్రైవేటు ఆపరేటర్లను ప్రభుత్వం అనుమతించనుంది. ఈ స్థాయిలో ప్రైవేటు ఆపరేటర్లు వస్తే ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల పరిస్థితి ఏమిటన్న ఆలోచన నేపథ్యంలోనే వీఆర్ఎస్ ఆలోచన పురుడు పోసుకున్నట్టు సమాచారం.

ఆర్టీసీలో ప్రతి యేటా 4వేల మంది పదవీ విరమణ చేస్తున్నారు. కొత్త నియామకాలు ఏవీ లేకపోవడంతో ఆర్టీసీ కార్మికుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. అయితే, ఇప్పుడున్న సిబ్బందిలో సగం మంది తగ్గాలంటే ఇంకా అయిదారేళ్లయినా పడుతుంది. అప్పటి వరకు వారికి జీతభత్యాలు చెల్లించడం కన్నా వీఆర్ఎస్‌ను అమలు చేసి బయటకు పంపడమే మేలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News