Bangladesh: టాస్ గెలిచిన బంగ్లాదేశ్... బౌలింగ్ చేయనున్న భారత్!

  • మధ్యాహ్నం ఒంటిగంట నుంచి మ్యాచ్
  • మూడు రోజుల టికెట్ల అమ్మకాలు పూర్తి
  • మ్యాచ్ చూసేందుకు వచ్చిన ప్రముఖులు

కోల్ కతాలో భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న డే అండ్ నైట్ టెస్టులో బంగ్లాదేశ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నేటి మధ్యాహ్నం ఒంటిగంట నుంచి మ్యాచ్ ప్రారంభం కానుండగా, ఇప్పటికే ఈడెన్ గార్డెన్స్ నిండిపోయింది. పలువురు ప్రముఖులు ఈ మ్యాచ్ ని తిలకించేందుకు వస్తుండటంతో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో పాటు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, షట్లర్ పీవీ సింధూ, షూటర్ అభినవ్ బింద్రా తదితరులు ఇప్పటికే స్టేడియానికి చేరుకున్నారు.

మరికాసేపట్లో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కూడా మ్యాచ్ ని చూసేందుకు రానున్నారు. ఇండియాలో జరుగుతున్న తొలి డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ ఇదే కావడం, భారత జట్టుతో పాటు బంగ్లాదేశ్ సైతం పింక్ బాల్ తో తొలిసారిగా ఆడనుండటంతో, ఈ మ్యాచ్ పై క్రేజ్ ఏర్పడింది. తొలి మూడు రోజుల టికెట్లు ఇప్పటికే అమ్ముడై పోయాయని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. మ్యాచ్ జరిగే తీరును బట్టి, తదుపరి రెండు రోజులకు కూడా క్రికెట్ అభిమానుల నుంచి మద్దతు లభిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. కాగా, ఈ మ్యాచ్ లో భారత జట్టు, తొలి టెస్టులో ఆడించిన జట్టుతోనే బరిలోకి దిగింది.

More Telugu News