Ayodhya: అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పును తప్పుపట్టిన స్వామి నిశ్చలానంద

  • రామ మందిరానికి స్థలం చెందుతుందని చెప్పడం సబబు
  • ఇతర మతాల వారికి స్థలాన్ని కేటాయించాలని చెప్పే అధికారం సుప్రీంకు ఎక్కడిది?
  • కాశీ, మధుర అంశాలపై కూడా ఇలాగే తీర్పులిస్తారా?

అయోధ్య స్థల వివాదం కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. వివాదాస్పద భూమి మొత్తం రాముడి ఆలయానికే చెందుతుందని... ముస్లింలకు మసీదును కట్టుకోవడానికి అయోధ్యలోనే మరొకచోట స్థలాన్ని కేటాయించాలని సుప్రీం తీర్పును వెలువరించింది. ఈ తీర్పును గోవర్ధన పీఠాధిపతి స్వామి నిశ్చలానంద సరస్వతి తప్పుపట్టారు.

రామ మందిరానికే స్థలం చెందుతుందని చెప్పడం సబబేనని... అయితే, ఇతర మతాల వారికి స్థలాన్ని కేటాయించాలని చెప్పే అధికారం సుప్రీంకోర్టుకు ఎక్కడిదని నిశ్చలానంద అసంతృప్తిని వ్యక్తం చేశారు. కాశీ, మధుర అంశాలపై కూడా ఇలాగే తీర్పులిచ్చి... ఆ ప్రాంతాలను మినీ పాకిస్థాన్ గా మార్చేస్తారా? అని ప్రశ్నించారు. అయోధ్యలో వివాదాస్పద 2.7 ఎకరాల భూమిని అందరికీ సమానంగా పంచాలనే ప్రతిపాదన అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు హయాంలోనే వచ్చిందని... ఆ ప్రతిపాదనకు అందరూ అంగీకరించినా, తాను మాత్రం అంగీకరించలేదని చెప్పారు. తన వల్లే ఆ ప్రతిపాదన మరుగున పడిపోయిందని తెలిపారు.

More Telugu News