Vizag: మన్యాన్ని కప్పేసిన పొగమంచు... అరకు బాట పట్టిన ప్రకృతి ఆరాధకులు!

  • రోజురోజుకూ తగ్గుతున్న ఉష్ణోగ్రతలు
  • తెల్లారి 8 గంటలైనా కనిపించని సూర్యుడు
  • తరలివస్తున్న పర్యాటకులు

విశాఖ ఏజెన్సీలో ముఖ్యంగా అరకు, పాడేరు తదితర ప్రాంతాల్లో చలిగాలులు విజృంభిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతూ ఉండటంతో, తెల్లారి 8 గంటలైనా సూర్యుడు కనిపించని పరిస్థితి. ఇదే సమయంలో సాయంత్రం నాలుగు గంటలకే భానుడు ముసుగేసేస్తున్నాడు. మన్యంలోని పలు ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా కురుస్తోంది.

పాడేరుకు సమీపంలోని మినుములూరు సెంట్రల్ కాఫీ బోర్డ్ కార్యాలయం, అరకు లోయ తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 11 డిగ్రీల సెంటీగ్రేడ్ కు పడిపోయింది. ఇదిలావుండగా, మన్యంలో పొగమంచు మధ్య ప్రకృతి అందాలను తిలకించేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో, హోటళ్లు, అతిథి గృహాలు కిక్కిరిశాయి. జీకే వీధి, చింతపల్లి, హుకుంపేట, పెదబయలు, ముంచంగిపుట్టు, అరకు లోయ, డుంబ్రిగూడ మండలాల్లో చలి తీవ్రత అధికంగా ఉంది.

బుధవారం మధ్యాహ్నం 3 గంటలకే తాము వాహనాలకు లైట్లు వేసుకుని నడపాల్సి వస్తోందని కొంతమంది పర్యాటకులు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం పాడేరులో 14 డిగ్రీలు, మినుములూరులో 16 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక పాఠశాలలకు వెళ్లే చిన్నారులు మంచు, చలితో ఇబ్బందులకు గురవుతున్నారు.

More Telugu News